Bombay High Court : ఆహార భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించే హోటల్స్‌పై మహారాష్ట్ర (Maharastra) ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కఠినచర్యలు తీసుకుంటోంది. పలు ఆహార కేంద్రాల లైసెన్స్‌లు రద్దు చేస్తోంది. ఈ నేపథ్యంలో నవీ ముంబయి (Navy Mumbai) కి చెందిన ఒక హోటల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని ఎఫ్‌డీఏకు సూచించింది.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్‌డీఏ నిర్వహించిన డ్రైవ్‌లో దాదాపు 100 హోటళ్ల లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. వాటిలో ఓ హోటల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాతపూర్వకంగా తగిన కారణాలు చెప్పకుండా లైసెన్స్ నిలిపివేయడాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ వేసింది. దీనిపై వాదనల అనంతరం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కొన్ని రోజుల క్రితం నా టేబుల్ దగ్గరకు ఒక పెద్ద కీటకం వచ్చింది. నేనిప్పుడు ఇలా మాట్లాడుతున్నానో లేదో ఒక ఈగ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాస్తవికంగా వ్యవహరించాలి’ అని ధర్మాసనం పేర్కొన్నది.
పరిశుభ్రత, నిర్వహణ, కార్యకలాపాల విషయంలో సంతృప్తికరమైన నివేదిక వచ్చినప్పుడు రెండు కీటకాలను చూపించి పూర్తిగా లైసెన్స్ నిలిపివేయడాన్ని సమర్థించలేమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ప్రజారోగ్యాన్ని విస్మరించలేమని కూడా స్పష్టంచేసింది. ఆ హోటల్‌పై సస్పెన్షన్ విధిస్తూ ఎఫ్‌డీఏ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. కాగా ఎఫ్‌డీఏ చర్యను ప్రభుత్వం తరఫు న్యాయవాది సమర్థించారు. ప్రజారోగ్యం విషయంలో ఉదాసీనతతో వ్యవహరించలేమని వాదించారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘అలా అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్యాంటీన్లు, హోటళ్లను తనిఖీ చేశారా..? హైకోర్టు క్యాంటీన్లో తనిఖీలు నిర్వహించారా..?’ అని ప్రశ్నించింది. అందుకు ప్రభుత్వ న్యాయవాది కొన్ని ఉదాహరణలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఎంసీ క్యాంటీన్, మంత్రాలయ క్యాంటీన్ లైసెన్స్‌లను నిలిపివేసిన విషయాన్ని ప్రస్తావించారు. దాంతో ‘హైకోర్టు క్యాంటీన్లో గురువారం తనిఖీలు నిర్వహించి శుక్రవారం రిపోర్ట్ ఇవ్వండి’ అని న్యాయస్థానం ఆదేశించింది.