Harish Rao | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామన్న కాంగ్రెస్, నేడు మాట తప్పిందని ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉండగా ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నేతల స్పందించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. నోఎల్ఆర్ఎస్- నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్ఆర్ఎస్కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎలాంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.