తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంత కాలంగా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. అబద్ధాలే ప్రాతిపదికగా కాంగ్రెస్ నేతలు పనిగట్టుకొని వ్యాప్తి చేస్తున్న అసత్యాలను, వేస్తున్న నిందలను బద్దలుకొట్టింది. తెలంగాణ జీవధార కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను, కుతంత్రాలను సాగునీటిశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు తుత్తునియలు చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సీనియర్ నేతలందరి ముందు హరీశ్‌రావు కాళేశ్వరంపై గంటన్నరపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ఇచ్చారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఎందుకు కట్టారో, ఎందుకు రీడిజైన్ చేయాల్సివచ్చిందో గణాంకాలు, లేఖలు, జీవోలు సాక్ష్యంగా ఆయన సోదాహరణంగా వివరించారు. కాళేశ్వరం కూలిందని, అదిక పనికిరాదని, అవినీతి జరిగిందని అధికార పార్టీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని ఎండగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, వాస్తవాలను తెలంగాణ ప్రజానీకం ముందుంచారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ స్వయంగా మేడిగడ్డను ఎంపిక చేసిన విషయాన్ని ఆధారాలతో సహా వివరించారు.
కొసమెరుపు: మహారాష్ట్ర అంగీకరించకపోవడం, నీటి లభ్యతలేదని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పడం, వన్యప్రాణి సంరక్షణ సమస్యలు తలెత్తడం, రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదని తేలడం కారణాల దృష్ట్యా తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాల్సివచ్చిందని హరీశ్ అరటిపండు ఒలిచినట్టు చెప్పిన విషయం యావత్ తెలంగాణ ప్రజానీకానికి అర్థమైంది. ఒక్క సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్‌కు తప్ప! ‘రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైతది’ అన్నట్టు కాళేశ్వరం కథంతా విని కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తుమ్మడిహెట్టి నుంచి ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారంటూ పాతపాటే పాడటం విడ్డూరం!
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవధార అని, రైతుల కల్పతరువు అని మాజీ మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. మేడిగడ్డ బరాజ్‌లో 86 పిల్లర్లలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలినట్టుగా కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొన్నట్టు బరాజ్‌కు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు-వాస్తవాలు’ అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో హరీశ్ గంటన్నరపాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక ఎకరాకూ నీళ్లివ్వలేదని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరంపై నిజానిజాలను ప్రజలకు వివరిద్దామని, ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు ప్రజా ఉద్యమాలు చేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన తాము తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టంచేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు బాజాప్తా హాజరవుతామని చెప్పారు.
నాడు 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ చేపడితే భూకంపాలు వస్తయని అనేకమంది రాజకీయం చేసిండ్రు. కరెంటు చార్జీలు భారమని గగ్గోలు పెట్టిండ్రు. కమిషన్లకు వెళ్లి మరీ ఫిర్యాదులు చేసిండ్రు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లంపల్లి రిజర్వాయర్ కడుతుంటే ఒక్కరూ మాట్లాడరు.
-హరీశ్
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు బట్టకాల్చి తమ మీదవేయాలని చూస్తున్నారని హరీశ్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అధికార పార్టీ నేతలు అనుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం తమపై బురదజల్లుతున్నారని, వాటిని ఆధారాలతోపాటు ప్రజెంటేషన్ల ద్వారా తిప్పికొట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై, ఏపీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరిగే నష్టంపైనా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పారు.
సాగు, తాగునీళ్లు ఇచ్చి తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్లో రిజర్వాయర్ నిర్మాణం చేపడితే భూకంపాలు వస్తాయంటూ అనేకమంది రాజకీయం చేశారని, ప్రాజెక్టు కరెంటు చార్జీల భారం అంటూ గగ్గొలు పెట్టారని, ఆఖరికి కమిషన్లకు వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారని గుర్తుచేశారు. కానీ ఏపీ ప్రభుత్వం గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టులో 150టీఎంసీల సామర్థ్యంతో బొల్లంపల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తుంటే ఒక్కరూ మాట్లాడటం లేదని నిప్పులుచెరిగారు.
తెలంగాణ ఏర్పడక ముందు గోదావరి జలాల సద్వినియోగానికి ఎవరూ కృషి చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. ‘గోదావరి నది పొడవు 1465 కిలోమీటర్లు ఉంటే అందులో 750 కిలోమీటర్లు తెలంగాణలోనే ప్రవహిస్తున్నది. గోదావరి నదీ జలాల్లో ఉమ్మడి ఏపీకి 1485 టీఎంసీల కేటాయింపులుంటే, తెలంగాణ వాటా 969 టీఎంసీలు! వాస్తవంగా తెలంగాణ ఏనాడూ 400 టీఎంసీలకు మించి వాడుకోలేని దుస్థితి! 2014 వరకు తెలంగాణలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఏవైనా ఉన్నాయా? అంటే ఎస్సారెస్పీ ఒక్కటే! దేవాదుల కట్టినా నీళ్లు రాని దుస్థితి! ఈ నేపథ్యంలో నీళ్ల కోసం ఉద్యమించాల్సి వచ్చింది. ఉప్పెనలా మారుతున్న తెలంగాణ ఉద్యమాన్ని చూసి తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
2007 నుంచి 2014 వరకు కేంద్రంలో, మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ఏ అనుమతీ సాధించలేదు. ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే భూమిలో 85 శాతం మహారాష్ట్రలో ఉన్నా అక్కడి ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఒక్క గుంట భూమి కూడా సేకరించలేదు. ఇదీ కాంగ్రెస్ నాయకుల నిర్వాకం. ఇక 2007లో రూ.17,875 కోట్లతో ప్రాజెక్టుకు జీవో ఇచ్చి, ఏ పనీ చేయకుండానే ఖర్చును 19 నెలల్లోనే అంటే 2009లో రూ.38,500 కోట్లకు పెంచిండ్రు. ఆ తర్వాత కేంద్రానికి డీపీఆర్ పంపినప్పుడు రూ.40,300 కోట్లకు పెంచిండ్రు. కీలకమైన బరాజ్ పనులను చేపట్టకుండా నాటి కాంగ్రెస్ నాయకులు సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ. 2,328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి జేబులు నింపుకొన్నారు.
తట్టెడు మట్టి ఎత్తకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట నిధులు స్వాహా చేసినట్టు స్వయంగా కాగ్ రిపోర్టులో వెల్లడించింది. అప్పుడు మంత్రులుగా ఉన్నది కూడా ఇదే కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్‌బాబులే! ఆనాడు రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉండి, ప్రాణహిత ప్రాజెక్టు జలయజ్ఞం కాదు.. ధనంయజ్ఞమని విమర్శించిండు. ఈరోజు అదే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అవినీతిని వెనకేసుకొస్తున్నడు’ అని నిప్పులు చెరిగారు. ప్రాణహిత-చేవెళ్ల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని, మరో రూ.20 వేల కోట్లు పెడితే ప్రాజెక్టు అయిపోతుండెనని మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారని, లెకలన్నీ తీయిస్తే రూ.3,700 కోట్లే కాంగ్రెస్ ఖర్చు చేసిందని, మరెందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని నిలదీశారు.
కాళేశ్వరం ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక ఎకరా కూడా పారలేదని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, 50 వేల ఎకరాలు మాత్రమే సాగయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నారని, ఒక కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారిందంటున్నారని, ఇలా ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు లెకలు చెప్తున్నారని హరీశ్ మండిపడ్డారు.
కాళేశ్వరం నీళ్లతో ఇప్పటివరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిందని స్పష్టంచేశారు. ఒక ఏడాది కరువు వస్తే, ఎస్సారెస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేశామని, మిడ్‌మానేర్ నుంచి ఎల్ఎండీకి నీళ్లు తెచ్చి, ఎల్ఎండీ ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్-1కు నీళ్లిచ్చామని గుర్తుచేశారు. ఎస్సారెస్పీ స్టేజ్-2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీరందించినట్టు చెప్పారు. కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలను కాపాడింది కేసీఆర్ ప్రభుత్వమని, ఇది నీటిపారుదలశాఖ అధికారులిస్తున్న వాస్తవ రిపోర్టు అని తెలిపారు. సీబీఐ, ఈడీ తరహాలో ఎన్డీఎస్ఏ కూడా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు జేబు సంస్థగా మారిందని విమర్శించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పాల్గొన్నారు.
ప్రాణహిత ప్రాజెక్టు కోసం కేసీఆర్ చేసిన కృషిని హరీశ్ వివరించారు. ‘తెలంగాణ పచ్చబడాలంటే గోదావరి జలాలే కావాలనుకున్నాం. ఉద్యమ ట్యాగ్‌లైన్ నీళ్లను ప్రజలకు సత్వరమే అందించాలని భావించాం. అందుకే 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటై, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే కేసీఆర్ ఆదేశాల మేరకు సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న నేను, ఇంజినీర్ల బృందంతో కలిసి మహారాష్ట్రకు వెళ్లిన. అకడ కాంగ్రెస్ సర్కారే ఉన్నది. ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించినం. కానీ అప్పటికే ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌చౌహాన్ రాసిన లేఖను గుర్తుచేసిండ్రు. 152 మీటర్లతో చేపట్టే ప్రాజెక్టు నిరుపయోగమన్నరు.
148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తేనే అంగీకరిస్తామని తేల్చి చెప్పిండ్రు. తర్వాత ప్రాజెక్టు కోసం రెండు రాష్ర్టాల అధికారుల మధ్య రెండు సార్లు అంటే 2014, ఆగస్టు 16, 2015, ఫిబ్రవరి4న హైదరాబాదులో చర్చలు జరిగినయి. ఆనాడు దివంగత నీటిపారుదల నిపుణులు ఆర్ విద్యాసాగర్‌రావు కూడా చర్చల్లో పాల్గొన్నరు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్దనే 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ఎంతో ప్రయత్నం చేసింది. కానీ మహారాష్ట్ర అంగీకరించలేదు. అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ సర్కారు పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా మళ్లీ మహారాష్ట్ర సాగునీటి మంత్రి గిరీశ్ మహాజన్‌తో ముంబైలో భేటీ అయినం.
ముఖ్యమంత్రుల స్థాయిలోనే సమస్య పరిషరించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పిండ్రు. దీంతో మళ్లీ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో సంప్రదింపులు జరిపినం. ప్రాజెక్టుకు అనుమతులు సాధించేందుకు ఫిబ్రవరి17న ముంబై వెళ్లి, సీఎం ఫడ్నవీస్‌తో కేసీఆర్ భేటీ అయిండ్రు. దాదాపు 45 నిమిషాల పాటు చర్చించిండ్రు. ప్రాజెక్టు ఆవశ్యకతను, తెలంగాణ అవసరాలను వివరించిండ్రు. చర్చల్లో తెలంగాణ బిడ్డ, అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా ఉన్నరు. సీఎం ఫడ్నవీస్‌ను ఒప్పించేందుకు ఆయనా కృషి చేసిండ్రు. అయినా ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. 152 మీటర్లతో ప్రాజెక్టు కడితే వాటిల్లే ముంపుపై తానే విదర్భ ప్రాంత నాయకుడిగా ప్రత్యక్ష పోరాటాలు చేసిన అని, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోనని నిర్మోహమాటంగా కేసీఆర్‌కు చెప్పిండ్రు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను ఒప్పించేందుకు చివరివరకూ ప్రయత్నించినం. మహారాష్ట్ర నేతలు తమ వైఖరి మార్చకోలేదు. సీఎం ఫడ్నవీస్ 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కట్టుకుంటే సహకరిస్తామని హామీ ఇచ్చిండ్రు’ అని హరీశ్ వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, గోదావరిపై ఏపీ ప్రభుత్వం కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టం గురించి కూడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తం. సాగు, తాగునీళ్లిచ్చి తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నరు. కాంగ్రెస్, బీజేపీ కుమక్కయి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నయి.
-హరీశ్
కాంగ్రెస్ ప్రభుత్వం 165 టీఎంసీలతో ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో ఆ మేరకు నీటినిల్వ సామర్థ్యం లేదు. కేవలం 16 టీఎంసీలకు మించి నీటి నిల్వ సాధ్యం కాదు. అందులో తుమ్మిడిహట్టి బరాజ్ వద్దనే 11 టీఎంసీల స్టోరేజీ. అది పోతే మొత్తంగా ఉన్నది కేవలం 5 టీఎంసీలే. నీటి నిల్వసామర్థ్యం తక్కువ ఉన్న నేపథ్యంలో ఆ కెపాసిటీలను పెంచుకోవాలని సీడబ్ల్యూసీనే సూచించింది. ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు కట్టాలని తెలిపింది. ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి వచ్చింది. అందుకు కేసీఆర్ నేతృత్వంలో ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు సభ్యులుగా క్యాబినెట్ సబ్‌కమిటీని వేసిండ్రు.
విశ్రాంత ఇంజినీర్లతో ఒక కమిటీ, ఇరిగేషన్‌శాఖ టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేసిండ్రు. చివరికి ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని నిర్ణయించినం. పరిష్కారంగా నీటిలభ్యతకు పూర్తి భరోసా ఉన్న మేడిగడ్డ కనిపించింది. టెక్నికల్ కమిటీ సూచించింది. రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ కూడా అంగీకరించింది. కానీ మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరుకు జలా లు తరలించలేమని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పిం డ్రు. గోదావరి ద్వారా జలాలను ఎల్లంపల్లి వరకు తరలించాలని నిర్ణయమైంది. అన్ని రిపోర్టులపై చర్చించి ప్రాణహిత-చేవెళ్లను మేడిగడ్డకు మార్చాలని సబ్‌కమిటీ నివేదిక ఇచ్చింది. దానిపై ప్రస్తుత మంత్రి తుమ్మల కూడా సంతకం పెట్టిండ్రు.
కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కూలిపోలే.. ఎట్ల జెప్తున్రూ అంటరా.. కాళేశ్వరంలో భాగమైన గంధమల్ల రిజర్వాయర్‌కు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన్రు. నిజంగా కాళేశ్వరమే కూలిపోతే.. గంధమల్ల రిజర్వాయర్‌ను ఏ నీళ్లతో నింపుతరు? మూసీకి ఏ నీళ్లు తరలిస్తరు?
మేడిగడ్డలో కుంగిన పిల్లర్‌ను సరిజేసి చిన్న మరమ్మతుతో మంచిగా వాడుకోవ చ్చు. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు.. డ్యామ్ భద్రతకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థ ఎన్డీఎస్ఏ చెప్తున్న మాట.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం అంత మంచిదికాదని తేలింది. మరి ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి? అనే చర్చ మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ వా ప్కోస్ మేడిగడ్డను ఎంపిక చేసింది. 2016 లో వచ్చిన సర్క్యులరే దీనికి సాక్ష్యం.
తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బరాజ్ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతం కిందికి వస్తది. అక్కడ అనుమతులు సాధించడం కష్టం. వాటి కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే తెలంగాణ ఎడారయ్యేది. ఇంకా ఆ ప్రాంతంలో నీటి లభ్యత కూడా తక్కువగా ఉంటది. నిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్‌లు లేనేలేవు. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు.. సెంట్రల్ వాటర్ కమిషన్ తన నివేదికలోనే చెప్పింది. వీటికి తోడు బరాజ్ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర సర్కారు పట్టుబట్టింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి గనుకనే.. ప్రాజెక్టును రీ-ఇంజినీరింగ్ చేయాల్సి వచ్చింది.
హైడ్రాలజీ, ఇంటర్‌స్టేట్ మ్యాటర్స్, కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ, ఇరిగేషన్ ప్లానింగ్, వ్యవసాయశాఖ, నీటిపారుదల శాఖ, కాస్ట్ అప్రైజల్ బోర్డ్, కేంద్ర అటవీ-వాతావరణ శాఖ, సెంట్రల్ సాయిల్ అండ్ మినరల్స్ శాఖ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇలా కేంద్ర, అంతర్రాష్ట్ర పరిధిలోని మినిస్ట్రీ, డైరెక్టరేట్ అన్ని బోర్డుల నుంచి కాళేశ్వరానికి అనుమతులు తీసుకొన్నరు.
కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలో కొత్తగా 20,33,572 ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. అలా సాగువిస్తీర్ణం 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు చేరింది. ధాన్యం ఉత్పత్తి 2.7 కోట్ల టన్నులకు చేరింది. అన్ని రకాల పంటల దిగుబడి నాలుగు రెట్లు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో జలాశయాలు, చెరువులు, చెక్ డ్యామ్‌లలో సంవత్సరం పొడువునా నీళ్లు ఉండటంతో చేపల ఉత్పత్తితో పాటు భూగర్భజలాలూ అమాంతం పెరిగాయి. రైతుల ఇండ్లల్లో సిరులు కురిశాయి. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టు.. కాళేశ్వరం నిజంగా ఓ వైఫల్య ప్రాజెక్టు అయితే, 2014కు ముందు ధాన్యం దిగుబడి ఇంత ఎందుకు పెరుగలే?
కాళేశ్వరం ప్రాజెక్డు డీపీఆర్ రూ. 80,190 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 94 వేల కోట్లు. లక్ష కోట్లు కూడా ఖర్చు కాని ఈ ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి ఎట్ల జరుగుతది? ఒకవేళ, అదే నిజమైతే, మన కండ్ల ముందు ఏ నిర్మాణం ఉండొద్దు కదా?!
కాళేశ్వరం ప్రాజెక్టు సర్వే, డీపీఆర్‌ను తయారు చేసే పనిని కేంద్రప్రభుత్వ సంస్థ వాప్కోస్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీని కోసం రూ. 677.67 లక్షలు కేటాయించారు. అయితే, లెక్కలు రాని కొందరు దీన్ని రూ. 677 కోట్లుగా దుష్ప్రచారం చేసిన్రూ.
మేడిగడ్డ బరాజ్ నిర్మాణాన్ని రిటైర్డ్ ఇంజినీర్లు ఏమీ వ్యతిరేకించలే. బరాజ్ నిర్మాణానికి మేడిగడ్డ అనువైన ప్రాంతమేనని నివేదిక సాక్షిగా స్పష్టం చేసిన్రు కూడా. అయితే, తాడిచర్ల బొగ్గు గనులు, సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు ఉన్న కారణంగా మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నీటి తరలింపు కష్టమవ్వచ్చని మాత్రం అన్నరు. దీంతో ఇంజినీర్ల సూచన మేరకు మేడిగడ్డ-మిడ్ మానేరు మార్గాన్ని మార్చి.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాళేశ్వరం కింద ఒక ఎకరా పారలేదని రేవంత్‌రెడ్డి అంటున్నరు. 50 వేల ఎకరాలే సాగైందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నరు. ఓ కాంగ్రెస్ నాయకుడు లక్ష ఎకరాలే పారిందంటరు. ఎవరి ఇష్టమొచ్చినట్టు వారు ఒక్కో లెక్క చెప్తున్నరు. 2014 ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనే ఉన్నది. మరి అప్పుడు ఇంత పంట ఎందుకు పండలే? అప్పుడు గోదావరి జలాల సద్వినియోగానికి ఎందుకు కృషి చేయలే? -హరీశ్
సీడబ్ల్యూసీ సూచనల మేరకు ఎస్సారెస్పీకి నీళ్లు రానప్పుడు కడెం, ఎల్లంపల్లి నుంచి, అక్కడ నీళ్లు లేకున్నా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను వినియోగించుకునేలా ప్రాజెక్టు రీడిజైన్ చేశారని హరీశ్ వివరించారు. ‘నీటిలభ్యత ఉండి, అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తని మేడిగడ్డకు బరాజ్‌ను మార్చినం. ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మేడారం, మలపేట, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండంచెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మకపల్లి రిజర్వాయర్ల విస్తరణ చేపట్టి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 141 టీఎంసీలకు పెంచినం’ అని తెలిపారు.
‘ప్రాణహిత-చేవెళ్లకు కాంగ్రెస్ సర్కారు ఒక్క అనుమతీ సాధించలేదు. కానీ కాళేశ్వరానికి కేసీఆర్ సర్కారు ఏడాదిలోనే అత్యంత స్వల్పకాలంలోనే అన్ని అనుమతులూ సాధించింది. సీడబ్ల్యూసీలోని 11 డైరెక్టరీల నుంచి అనుమతులు తీసుకొచ్చింది. నిర్మాణానికి అడ్డగోలు అప్పు చేసినట్టు మాట్లాడుతున్నరు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తరహాలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరికీ బ్రొకరేజ్ చార్జీలు చెల్లించి, స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి అప్పులు తేలేదు. రూ.170 కోట్లు చెల్లించి కాంగ్రెస్ 10 వేల కోట్లు అప్పుతెచ్చింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం రూపాయి చెల్లించకుండా కాళేశ్వరం కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పీఎఫ్సీ నుంచి రుణాలు తెచ్చింది. అప్పుతెచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రాజెక్టుకే ఖర్చు చేసింది. ప్రాజెక్టుకు ఆర్ఈసీ ఏ-ప్లస్ గ్రేడ్ సర్టిఫికెట్ ఇచ్చింది. రూ.80 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికీ రూ.94 వేల కోట్లు ఖర్చు చేసింది.
‘కాళేశ్వరం లేకుండానే రికార్డుస్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసినమని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్తున్నరు. అన్నీ శ్రీరాంసాగర్ నీళ్లే అంటున్నరు. కాంగ్రెస్ వాళ్లను నేను ఒక్కటే అడుగుతున్న. గతంలో ఎస్సారెస్పీ లేదా? వానలు పడలేదా? మరి అప్పుడెందుకు ధాన్యం పండలేదు. కాలువలు పారలేదు? మరి ఈ 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు పూర్తిచేసింది? ఏ రిజర్వాయర్ కట్టింది? ఎక్కడ కాలువలు తవ్వింది? మరి ఇంతగనం పంటలు ఎట్ల పండినయి? కాళేశ్వరం ద్వారానే లక్షల ఎకరాల్లో పంటలు పండినయి. ఇదే సత్యం!’ అని హరీశ్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మోటర్లతోనే మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణకు, రంగనాయక సాగర్‌కు, మల్లన్నసాగర్‌కు, కొండ పోచమ్మసాగర్‌కు నీళ్లు వచ్చాయని, ఇదంతా కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన నీటి పంపిణీ వ్యవస్థ పనిచేయడం వల్లేనని స్పష్టంచేశారు. చెరువులను బాగుచేయడం, 3200 తూములు కొత్తగా పెట్టి కాలువలతో అనుసంధానించడం, వాగులపై చెక్‌డ్యామ్‌లు కట్టడం ద్వారా కొత్త, స్థిరీకరణ కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఇంజనీరింగ్ మార్వెల్.. అనేక మంది ప్రశంసలు కురిపించిండ్రు. దానివల్ల బీఆర్ఎస్కు మంచి పేరు వస్తున్నదనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. ఏదైనా డ్యామేజీ జరిగితే ప్రాజెక్టు అథారిటీయే పునరుద్ధరించాలి. ఇది ఎన్డీఎస్ఏ చట్టమే చెప్తున్నది. మేడిగడ్డలో 2023, అక్టోబర్ 21న పిల్లర్ కుంగింది. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది. రాష్ట్రం ఎలాంటి అభ్యర్థన చేయకముందే రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ అధికారులు మేడిగడ్డకు వచ్చి హడావుడి చేసిండ్రు. ఈడీ తరహాలోనే ఎన్డీయే సర్కారు జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ వ్యవహరిస్తున్నది’ అని హరీశ్‌రావు ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవని హరీశ్ విమర్శించారు. ‘మేడిగడ్డ బరాజ్‌లో 85 పిల్లర్లు ఉంటే అందులో రెండే పిల్లర్స్ కూలాయి. మిగతా మొత్తం కాళేశ్వరం వ్యవస్థ పనిచేస్తున్నది. అందుకే గంధమల్లకు నీళ్లు తెస్తా. మూసీని గోదావరితో నింపుతా అని సీఎం రేవంత్ అంటున్నరు.
కాళేశ్వరం మీద హైదరాబాద్ 30 టీఎంసీల మంచి నీరు, ఎన్‌రూట్ గ్రామాలకు 10 టీఎంసీల మంచి నీరు, 16 టీఎంసీలు పరిశ్రమలకు వాడుతాం. నిరుడు వర్షాలు బాగా పడినయ్ కాబట్టి ఇబ్బంది రాలేదు. మిడ్ మానేరు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఆపరేట్ చేసుకున్నం. రేపు ఎకడన్న కరువు వస్తే హైదరాబాద్, ఎన్ రూట్ గ్రామాలు, పరిశ్రమలకు నీటి పంపిణీలో ఇబ్బందులు వస్తయి. ప్రభుత్వం భేషజాలకు పోకుండా మేడిగడ్డ బరాజ్ రిపేర్ చేసినట్టయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కాళేశ్వరం కల్పతరువుగా ఉంటుంది. ఇకనైనా అలాంటి కాళేశ్వరంపై దుష్ప్రచారాలు మానాలి’ అని సూచించారు. ‘కాళేశ్వరం కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం.. కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాలన్నీ పటాపంచలు చేస్తాం. దానికి భయపడేది లేదు. ప్రాణ త్యాగాలకే సిద్ధపడ్డ నాయకత్వం బీఆర్‌ఎస్‌దీ. చిల్లర తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. కాళేశ్వరంపై చేసిన గోబెల్స్ ప్రచారాలను పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం కమిషన్ ముందు పెడుతాం’ అని హరీశ్ స్పష్టం చేశారు.
కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తున్నది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం!
– కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
తెలంగాణ రాష్ట్ర సాగు, తాగు, పరిశ్రమల నీటి సమస్యలకు ముక్తిని ప్రసాదించే ప్రాజెక్టు ఇది!
– అప్పటి గవర్నర్ నరసింహన్
దేశంలో ఎక్కడా లేనివిధంగా పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ పనుల ప్రణాళిక బాగున్నది.
– కాళేశ్వరాన్ని పరిశీలించిన సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మంచి పనిచేశారు..
– ఏపీ సీఎం చంద్రబాబు
దేశ చరిత్రలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు ఎక్కడాలేదు.
-కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఒకప్పుడు వట్టిపోయిన గోదావరి ఇప్పుడు కాళేశ్వరంతో జీవధారగా మారింది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ప్రవహిస్తున్నాయంటే ఇందుకు కారణం కేసీఆర్ ప్రభుత్వం..
-వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్
తెలంగాణ జల విధానం దేశానికే ఆదర్శం
-పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజినీరింగ్ అద్భుతం..అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు నా పదవీకాలంలోనే పూర్తికావడం ఇదే మొదటిసారి..
– సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ సీకేఎల్ దాస్
ప్రపంచంలోనే కాళేశ్వరం అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం పెరిగింది..
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి సతీశ్‌చంద్రశర్మ
కాళేశ్వరం అద్భుతం..ఇంజినీర్ల పనితనం అభినందనీయం
– హైకోర్టు జడ్జిల బృందం
రూ. 94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యం?
– సూదిని పద్మారెడ్డి (సీఎం రేవంత్‌రెడ్డి మామ)