సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 1: ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రిని కలిసి తీర్మాన ప్రతులు అందజేశారని గుర్తుచేశారు. వర్గీకరణకు త్వరగా పరిష్కారం చూపాలని కోరారని తెలిపారు. కానీ ఇపుడు వెంటనే ఆచరణలోకి తీసుకొస్తామని, ఉద్యోగ నియామకాల్లోనే అమలు చేస్తామని అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. శనివారం సిద్దిపేట జిల్లా రంగధాంపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో వర్గీకరణకు అనుకూలంగా రిజర్వేషన్లు కల్పించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా మాదిగలు న్యాయమైన హక్కు కోసం పోరాటం చేశారని, ఇందులో రాజకీయాలకు అవకాశంలేదని, రాజకీయాలు చేస్తే మాదిగలకు అన్యాయం చేసినట్టేనని చెప్పారు.
ఊరూరా అంబేద్కర్!
అంబేద్కర్ దయ, కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని హరీశ్‌రావు తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపర్చడం వల్లనే రాష్ట్రం సాకారమైందని చెప్పా రు. అంబేద్కర్ ఆలోచనా విధానాలు, సిద్ధాంతాలను విద్యావంతులు ప్రజలకు బోధించాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం ప్రారంభిస్తే.. కాంగ్రెస్ సర్కారు పక్కనపెట్టిందని విమర్శించారు. సచివాలయానికి కేసీఆర్ ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పా టు చేసిందని గుర్తుచేశారు. నేడు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి అంబేద్కర్ మహావిగ్రహాన్ని దర్శించుకునేందుకు కూడా అనుమతించడం లేదని మండిపడ్డారు. అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లతో పాటు చాలా పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. తన నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం లేని ఒక్క ఊరు కూడా ఉండకూడదని, ఎక్కడైనా లేకపోతే తాను సొంత ఖర్చులతో ఏర్పా టు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టడమే కాకుండా అంబేద్కర్ జయంతి, వర్ధంతి నిర్వహిస్తూ ఆయన ఆశయాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు.