హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సర్పంచుల బకాయిలను ఏ తేదీలోగా చెల్లిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనికి ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది. సర్పంచుల పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. హస్తం గుర్తు సర్పంచుల పాలిట భస్మాసార హస్తంగా మారిందని, సర్పంచుల ఉసురు పోసుకుంటున్నదని దుయ్యబట్టారు. ఆయనతోపాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా ప్రశ్నలు సంధించారు. దీనిపై మంత్రి సీతక్క సమాధానమిస్తూ రూ.691 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
పగబట్టి ఇబ్బంది పెడుతున్నరు: హరీశ్‌రావు
ఒక్క నెలలోనే బడా కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఇవ్వాల్సిన రూ.691 కోట్ల నిధులను మాత్రం ఏడాదిగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. రూ.ఐదు, పది లక్షల విలువైన పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల బిల్లులను చెల్లించకుండా పగబట్టి, కక్షతో వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. గవర్నర్, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నా లాభం లేదని, చలో అసెంబ్లీకి పిలుపునిస్తే అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. నెలనెలా పల్లెప్రగతి నిధులు ఇచ్చి ఉంటే, పెండింగ్ బకాయిలుండేవి కావని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయని, పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రతి నెలా గ్రామాలకు రూ.275 కోట్లు, పట్టణాలకు రూ.150 కోట్లు ఇచ్చామని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లె, పట్టణప్రగతి కింద ఒక రూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వలేదని విమర్శించారు. ‘కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులను ప్రకటిస్తే, టాప్ 20లో 19 తెలంగాణ నుంచి ఉన్నాయని గుర్తుచేశారు. ఈ ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, డంప్‌యార్డ్, వైకుంఠధామం ఏర్పాటు చేసి తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలిపామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సీ నిధులు విడుదల కావడం లేదని, కేంద్రం ఇచ్చిన ఈజీఎస్ నిధులు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. జీపీ జనరల్‌ఫండ్స్ విషయంలో వాళ్ల డబ్బులు వాళ్లు ఖర్చుపెట్టుకోవడానికి ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, చెకులు పాస్ కాకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేసి, బంగారం కుదవపెట్టి పనిచేస్తే బిల్లులు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
అమెరికా హెచ్చరించే స్థితికి తెచ్చారు
తెలంగాణకు పోతే చికున్‌గున్యా వ్యాధులు వస్తున్నాయని అమెరికా తన పౌరులను హెచ్చరించే స్థితికి రాష్ర్టాన్ని దిగజార్చారని హరీశ్‌రావు మండిపడ్డారు. అమెరికా హెచ్చరికలను బట్ట్టి చూస్తే, పల్లెలను కాంగ్రెస్ సరార్ ఏవిధంగా నిర్లక్ష్యం చేసిందో అర్ధమవుతున్నదని పేర్కొన్నారు. ఇది మన రాష్ట్రానికే కాదు, దేశానికే అవమానమని, మీ పాలన ఈ విధంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు దిగిపోయి తొమ్మిది నెలలైనా ఇంకా వారికి జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, పంచాయతీ ఎన్నికలలోపు వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మోసం చేస్తున్నరు
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తెచ్చిన 73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం, గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని, క్రమంతప్పకుండా నిధులు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. మాజీ సర్పంచులు, జడ్పీటీసీలకు పింఛన్లు ఇస్తామని ఆశ పెట్టి, కనీసం జీతాలు కూడా ఇస్తాలేరని చెప్పారు. ఏడాది అయినా బిల్లులు చెల్లించకపోవడం, చేస్తాం.. చూస్తాం అంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రశ్న అడగనివారికి అవకాశం
పెండింగ్ బిల్లులపై ప్రశ్నోత్తరాల సమయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి స్పీకర్ మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. ఆయన విమర్శలకు దిగడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల ఎజెండాను చూపుతూ లేని సభ్యుడికి ఎలా అవకాశమిస్తారని ప్రశ్నించారు. సభను నడుపుతున్న తీరు పట్ల హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తంచేశారు. మొదటి ప్రశ్నలో తాము అవకాశం కోరితే ఇవ్వలేదని, అదే మూడో ప్రశ్నకు మాత్రం ప్రశ్న అడగని వారికి అవకాశామిచ్చారని ప్రస్తావించారు. అవకాశం ఎందుకిచ్చారని తాను అడగడంలేదని, కానీ, సభా సంప్రదాయాలు అందరికీ సమానంగా ఉండేలా చూడాలని స్పీకర్‌ను కోరారు.
ఇదేనా ట్రైనింగ్.?
సభలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా పలువురు కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. హరీశ్‌రావు వారి ప్రయత్నాలను తిప్పికొట్టారు. సభను ఆర్డర్లో పెట్టాలని స్పీకర్‌ను కోరారు. మొన్న రెండురోజులు ట్రైనింగ్ ఇచ్చారు.. ఇదేనా ట్రైనింగ్? అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు శాంతించారు.
రజాకార్ల సమయంలోనూ ఇంత నిర్బంధం లేదు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ నియోజకవర్గంలోని 127 గ్రామాల్లో రూ.47 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ 12 నెలల్లో రూపాయి ఇవ్వలేదని చెప్పారు. బచ్చన్నపేట మండలంలో మహిళా మాజీ ప్రతినిధులు బిడ్డ పెండ్లికి బంగారం, ఇండ్లు కుదువపెట్టిన ఘటనలు ఉన్నాయని వివరించారు. పెండింగ్ బిల్లులను వారం పదిరోజుల్లో చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధులు సచివాలయానికి వద్దామంటే తెల్లవారుజామున నాలుగు గంటలకే కల్లాపి జల్లకముందే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రజాకార్ల సమయంలోనూ ఇంత నిర్బంధంలేదని దుయ్యబట్టారు.
అరెస్టులను ఆపాలని కోరారు.
సమగ్రశిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తుంటే పట్టించుకోరా?: కొత్త ప్రభాకర్‌రెడ్డి
సమగ్రశిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తుంటే పట్టించుకోరా? అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పదిహేను రోజులుగా నిరసన తెలిపిన ఉద్యోగులు సమ్మెకు దిగారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పంచాయతీలకు సంవత్సరంలో రూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. మంత్రులు, కలెక్టర్లు ఫోన్లు చేస్తే స్పందించడంలేదని, సమీక్షలకు అధికారులు హాజరుకావడంలేదని ఆరోపించారు.