కరీంనగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే పక్కాగా చేపట్టాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గత 75 ఏళ్లుగా బీసీలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అదే తీరులో మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన కుల గణన అంతా కాకి లెక్కలేనని ఆరోపించారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.
బీసీ గణన శాస్త్రీయంగా చేయకపోతే హైకోర్టు కొట్టి వేస్తుందని పేర్కొన్నారు. బీహార్, కర్ణాటకలో ఇలాగే జరిగిందని, మరోసారి తెలంగాణలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2011 జనాభా లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్లకు పైగా జనాభా ఉన్నట్లు తేల్చారని సరాసరి జనాభా పెరుగుదల శాతం 13.8 ఉంటుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కన తీసుకున్న ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల 20 లక్షలకు పైగా దాటి ఉండాలన్నారు. ఆధార్ లెక్కలు తీసుకున్నా 3.96 కోట్ల ఆధార్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు.
కేంద్రం ఎన్నికల సంఘం జనవరి 5న ఇచ్చిన ఓటరు జాబితా ప్రకారం కూడా 3.30 కోట్ల ఓటర్లు ఉన్నారని విద్యాసంస్థల లెక్కలు తీస్తే మరో 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయని వివరించారు. ఈ లెక్కన చూసినా కూడా సుమారుగా నాలుగు కోట్ల తెలంగాణ జనాభా ఉన్నట్టు తేలుతుందని పేర్కొన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కోట్ల 75 లక్షల మంది మాత్రమే తెలంగాణ జనాభా అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలు రాష్ట్రంలో 56 శాతం మేరకు ఉంటారని పేర్కొన్నారు. బీసీలకు వాటా మేరకు రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, పోరాటం చేస్తామని హెచ్చరించారు.