కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 5: తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభు త్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచా రం చేస్తున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులు ఎండిపోయేలా చేస్తున్నదని విమర్శించారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కరీంనగర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గంగుల లైవ్‌లో వీక్షించారు. అనంతరం గంగుల మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు ఇచ్చిన ప్రజెంటేషన్‌తో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు కుల్లంకుల్లగా అర్థమైందన్నారు.
‘ప్రభుత్వం మాదే కదా అని కమిటీలు ఏ రిపోర్టు ఇచ్చినా మార్చుకోవచ్చు.. ప్రభుత్వంగా మేము ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అని కొన్ని పేపర్లకు లీకులు ఇచ్చి కథనాలు రాపిస్తున్నారు’ అని మండిపడ్డారు. మళ్లీ తెలంగాణలోని నీళ్లను ఆంధ్రకు తరలించుకు పోయే కుట్రలో భాగమే ఇదంతా సాగుతున్నదని ధ్వజమెత్తారు. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌ను దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ నాయకులు ఎస్సారెస్పీ తర్వాత గోదావరిపై ఎక్కడైనా ఒక్క ఆనకట్టనైనా కట్టారా? అని ప్రశ్నించారు. 1963 తర్వాత ప్రపథమంగా గోదావరిపై ఆనకట్ట కట్టింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ విజ య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ పాల్గొన్నారు.