కార్పొరేషన్, అక్టోబర్ 10 : కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా ప్రజలకు బాకీ పడిందని, ఆ బాకీలను ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని గాంధీచౌక్‌లో నిరసన తెలిపి.. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఆడబిడ్డకు రూ.2500 ఇస్తామని చెప్పారని దీంతో ఇప్ప టి వరకు ఆడబిడ్డకు రూ.55 వేలకు వరకు బాకీ ఉందని తెలిపారు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని చెప్పి దాటవేశారని దుయ్యబట్టారు.
వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి రూ.44 వేలు, దివ్యాంగులకు నెలకు ఆరు వేలు ఇస్తామని రూ.44 వేలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల బాకీ, నిరుద్యోగ భృతి 22 నెలలకు కలిపి రూ.88 వేలు, విద్యా భరోసా కింద రూ.5 లక్షలు, రైతులకు భరోసా కింద రూ.76 వేలు, రుణమాఫీ కింద రూ.2 లక్షలు బాకీ ఉన్నదని వెల్లడించారు.
ఎప్పటిలోగా ప్రభుత్వం బాకీ తీరుస్తుందో సీఎం రేవంత్ చెప్పాలని డి మాండ్ చేశారు. బీసీలకు ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్లో పెడుతామని ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. వీటిపై ప్రజల్లో అవగాహన తీసుకువస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.