Arekapudi Gandhi | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘మీరు బీఆర్ఎస్లో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఇంతకూ ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమాధానాన్ని దాటేశారు. ఇప్పటికే గాంధీ ఏ పార్టీలో ఉన్నారంటూ జరుగుతున్న రచ్చకు ఆయన తెరదించకపోగా, ఎప్పటికప్పుడు సమాధానం దాటేస్తూనే ఉన్నారు. తాజాగా గాంధీ తన ఇంటివద్ద మీడియా సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా డిసైడ్ చేసుకోలేని దుస్థితిలో ఒక ఎమ్మెల్యే ఉన్నారా? అన్న చర్చ కూడా మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుండగా, మరోవైపు వివేకానందనగర్‌లోని అరకపూడి గాంధీ ఇంటివద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ఉదయం నుంచి హైడ్రామా తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు.
బీఆర్స్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అంటే ఎంతో అభిమానమని, వారు ఏ రోజూ ప్రజలను తప్పుగా మాట్లాడిన సందర్భాలు లేవని గాంధీ పేర్కొన్నారు. వీరు హుందాగా వ్యవహరించారని చెప్పారు. కేసీఆర్ ఉద్యమంతోపాటు పదేండ్ల పాలనలో ఆంధ్ర, తెలంగాణ పేరిట మాట కూడా తూలకుండా గౌరవంగా వ్యవహరించారని వివరించారు. కౌశిక్‌రెడ్డి పరుషంగా మాట్లాడటం వల్లే తాను ఆ విధంగా ప్రతిస్పందించాల్సి వచ్చిందని గాంధీ చెప్పారు. చివరగా తన పార్టీ ఏదంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.