హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తడీపార్ అమిత్‌షాకు తంబాకు బండి సంజయ్ ఎన్ని చెప్పులు మోసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సేనని ఎంపీ, ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి, కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు బుద్ధిచెప్తారని హెచ్చరించారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నోముల భగత్, నల్లమోతు భాస్కర్‌రావు మీడియా సమావేశంలో బీపేపీ, కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు.
ఎంపీ బడుగుల మాట్లాడుతూ.. మునుగోడును కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. బండి సంజయ్ బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ జనంలేక వెలవెలబోయిందన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకూ అమిత్ షా సమాధానం చెప్పకుండా తోకముడిచారని ఎద్దేవాచేశారు. దేశ రైతుబంధుగా సీఎం కేసీఆర్‌ను కీర్తిస్తుంటే.. అమిత్ షా సిగ్గులేకుండా రైతువిరోధిగా పేర్కొనడం అవగాహన రాహిత్యానికి నిదర్శమని మండిపడ్డారు.
తడీపార్ ‘చెప్పు’ చేతల్లో బండి
గుజరాత్ తడీపార్ ‘చెప్పు’ చేతల్లో తామున్నామని బండి సంజయ్ నిరూపించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఎమ్మెల్యే గాదరి కిశోర్ మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక బీజేపీని రాష్ట్రంలో అడ్రస్‌లేకుండా చేస్తుందని చెప్పారు. రెండోస్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయని చెప్పారు. మునుగోడు సభలో అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలేనని, నల్లగొండలో ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలు అద్భుతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మూడో కాలేజీ ఇటీవలే మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు. భావోద్వేగాలతో రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తున్నదని, ఇందులో భాగంగానే అమిత్ షా సెప్టెంబర్ 17ను మళ్లీ తెరమీదికి తెచ్చారని ధ్వజమెత్తారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి, అమిత్ షాకు లేదని పేర్కొన్నారు.
22 మంది కేంద్రమంత్రులు.. దళితులు, మహిళలపై లైంగికదాడులకు పాల్పపడ్డవారేనని, వారిపై కేసులు సైతం నమోదు అయ్యాయని ఉదహరించారు. దేశంలో సీఎం కేసీఆర్‌ను మించిన దళితుడు మరొకరు లేరన్నారు. 2014, 2018 మ్యానిఫెస్టోల్లో దళితుడిని సీఎం చేస్తామని ప్రకటించలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారిణి అని పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవనీ ఆమెనే తేల్చిచెప్పారన్నారు. ఆమె మీద ఆరోపణలు చేస్తూ బీజేపీ శిఖండి రాజకీయం చేస్తున్నదన్నారు.
అన్ని వర్గాల అబద్బాంధవుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ఆపద్బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే నోముల భగత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ కుమ్మక్కు రాజకీయాలు చేసినా టీఆర్ఎస్ ప్రజాబలం ముందు ఏమీ చేయలేవన్నారు. బీజేపీకి దమ్ముంటే మునుగోడులో మ్యానిఫెస్టో పెట్టాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు డిమాండ్‌చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఉండాలా? వద్దా? వడ్లు కొంటారా? కొనరా? దమ్ముంటే వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో స్పష్టంచేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నకు అమిత్‌షా జవాబు చెప్పలేదంటేనే బీజేపీ వ్యవహారం ఏమిటో తేలిపోయిందన్నారు.