హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎందుకంటే, కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదు. వారికి ఆ భరోసా ఇవ్వలేకపోతున్నాం. హైడ్రా వల్ల ఇది మరింత డేంజర్‌గా తయారైంది. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది.
Danam Nagender | హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన కృషి వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని కితాబిచ్చారు. అవినీతి ఉన్నదా? లేదా? అనేది తర్వాత విషయమని, ఫార్ములా-ఈ రేస్ హైదరాబాద్‌కు మేలు చేసిందని స్పష్టంచేశారు. ఇందులో కేటీఆర్ అవినీతి ఏమైనా ఉంటే వెంటనే బయటపెట్టాలని, తద్వారా ఈ గొడవ, ప్రజల్లో కన్ఫ్యూజన్ పోతాయని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రజలను రోడ్డున పడేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ ప్రజల్లో నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక గొప్ప నాయకుడని, ఆయన భోళా శంకరుడని చెప్పారు. గురువారం ఆయన ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక, సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
ఫార్ములా-ఈ రేస్ హైదరాబాద్‌కు రావడం మంచి పరిణామం. ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచిందనడంలో అనుమానం లేదు. రాష్ర్టానికి ఫార్ములా-1 తీసుకొనిరావాలని అప్పట్లోనే సీఎం చంద్రబాబు గచ్చిబౌలిలో భూ సేకరణ చేశారు. ఇందుకోసం అంతర్జాతీయ టీం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించింది. అప్పుడే వస్తుందని అనుకున్నాం. కాని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఫార్ములా-ఈ రావడం అనేది హైదరాబాద్‌కు మంచిదైంది. హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు దోహదపడింది. ఇందులో అవినీతి ఉన్నదా? లేదా? అనేది తర్వాత విషయం. అది కోర్టులు తేలుస్తాయి. కేటీఆర్ మాత్రం అవినీతి జరగలేదని, హైదరాబాద్ ఇమేజ్ను పెంచామని చెప్తున్నారు. ఎన్నో సంస్థలు పోటీపడ్డాయని, ఒక దశలో ఫార్ములా-ఈ రేస్ దుబాయ్‌కి వెళ్లే ఆలోచన చేస్తే వాళ్లతో మాట్లాడి.. ఇక్కడికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఫార్ములా-ఈ రేస్ హైదరాబాద్‌కు తీసుకొనిరావడంలో కేటీఆర్ చేసిన కృషిని కాదనలేం.
కేటీఆర్ అవినీతిని బయటపెడతామని అంటున్నారు. అలా అయితే ఏమైనా అవినీతి ఉంటే వెంటనే బయటపెట్టేయాలి. అలా చేస్తే ఈ గొడవ ఉండదు. ప్రజల్లో లేనిపోని కన్యూజన్ క్రియేట్ అవుతున్నది. కాబట్టి, అవినీతి ఉంటే వెంటనే బయటపెట్టేయాలి. అవినీతి లేనట్టు కేటీఆర్ నిరూపించుకుంటే సంతోషమే. లేకపోతే అవినీతి ఉన్నదని ప్రభుత్వం నిరూపిస్తే చట్టమే శిక్షిస్తుంది.
హైడ్రా పేరుతో ప్రజలు వెళ్లే దారిని మూసివేస్తుంటే నేను మాట్లాడటానికి వెళ్లిన. అక్కడ ప్రజలు ఆవేశంతో గోడను కూల్చేశారు. నాపై రంగనాథ్ కేసు పెట్టలేదు. అక్కడ ఒక డీసీపీ ఉన్నారు. ఆయనే సుప్రీం అనుకుంటూ ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దానిని భూతద్దంలో చూపించి తాను నీతిమంతుడినని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నరు. ఆ డీసీపీ వల్లనే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెడ్డపేరు వస్తున్నది. ఆ డీసీపీ ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తే సంతోషంగా ఉంటుంది. కానీ, ఎవరిపై పడితే వారిపై కేసులు పెట్టుడు.. 20 ఏండ్ల కింది కేసులు తిరిగి తోడటం చేస్తుండు. పార్లమెంట్ ఎన్నికల్లో నాపై 12 కేసులు పెట్టారు. సుమోటోగా కేసులు పెట్టేస్తున్నారు. అలాంటి అధికారులకు స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వానికి ప్రమాదకరం. నాకేమీ కాదు. అలాంటి అధికారులు వస్తుంటారు.. పోతుంటారు. అలాంటి వాళ్లు నా తలపై ఉన్న వెంట్రుకలంత మందిని చూసిన. అలాంటి ఆఫీసర్లకు నేను భయపడే వ్యక్తిని కాను. ఆయన తూ అంటే నేను తూతూ అంటా. అలాంటి ఆఫీసర్లను లెక్కచేయను. కానీ, సీఎం ఆలోచించుకోవాలి.. అలాంటి వాడు ఉండాలా.. లేదా? అనేది.
ప్రజల కోసమే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. సొంత పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించాల్సి వచ్చింది. అధికారంలో ఉంటమా? లేదా? అనేది కాదు.. ప్రజల మధ్య ఎలా ఉన్నాం.. ప్రజలతో సంబంధాలు ఎలా ఉన్నాయనేదే ముఖ్యం. ఈ అంశంపై అసలు నన్ను ఎప్పుడూ సీఎం రేవంత్‌రెడ్డి మందలించలేదు. ఆయన ఈ టాపిక్ ఎత్తలేదు. ఒకవేళ సీఎం మందలిస్తే.. దానికి దారితీసిన కారణాలను కూడా చెప్పేవాడిని. హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రజలను నిర్ద్ధాక్షిణ్యంగా రోడ్డుపైకి నెట్టొద్దు కదా. మన ఓటుబ్యాంకు వాళ్లే. మనల్ని కాపాడేదీ వాళ్లు.
బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాకు అధికారం లేదు. ఇప్పుడు కూడా నాకు అధికారం కావాలని అడగలేదు.. అడగను కూడా. అధికారం అనేది ముఖ్యం కాదు.. హైదరాబాద్ సిటీలో ఎంత వ్యాల్యూ ఉందనేది ముఖ్యం. పేరుతోనే పనులు జరుగుతాయి. దీనికి అధికారం అవసరమా? దానం నాగేందర్ అనేదే ఒక బ్రాండ్. అంతేగాని, అధికారం ఉంటేనే పనులు జరుగుతాయనేది కాదు. న్యాయపరంగా ఏది ఉన్నా చేయించుకుంటా. పని న్యాయంగా ఉంటే ఎందుకు చేయలేదని గల్లా పట్టుకుని అడిగే సత్తా నాకు ఉన్నది.
సీనియర్ లీడర్‌గా సిటీలో పార్టీ పటిష్ఠత కోసం ఇప్పటివరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. సంప్రదించాలని అనుకుంటున్నా. హైదరాబాద్‌లో వ్యాక్యూమ్ ఉన్నది. సిటీలో క్యాడర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. సీఎం అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలో ఆ స్పందన ఎక్కడా కనిపించడం లేదు. ఆ ఉత్సాహం లేదు. కార్యకర్తలు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారనే అంశంపై దృష్టిపెట్టాలి. కార్యకర్తలు ఏదో ఒక పదవి దక్కకపోతుందా! అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం సమయం ఇచ్చినప్పుడు వారి గురించి చెప్తాను.
ఒక సీనియర్ సభ్యుడిగా అసెంబ్లీలో బూతులు మాట్లాడటం తప్పే.. అది ఆవేశంలో మాట్లాడాను. చాలాసార్లు గొడవలు అయ్యాయి కానీ, ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అలా మాట్లాడినందుకు వ్యక్తిగతంగా విచారం వ్యక్తంచేస్తున్నాను. ఇందుకు సంబంధించి కేటీఆర్‌ను స్వయంగా కలిసి సారీ కూడా చెప్పిన.
వైఎస్సార్, కేసీఆర్, రేవంత్‌రెడ్డి పాలనను పరిశీలిస్తే, వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కేసీఆర్ గొప్ప నాయకుడు. వ్యక్తిగతంగా చాలా మంచివ్యక్తి. ఆయన ఆగ్రహంగా, కోపంగా మాట్లాడొచ్చు.. కాని, ఆయన మనసు సున్నితమైంది. ఒకవిధంగా చెప్పాలంటే కేసీఆర్ భోళా శంకరుడు.