నిజామాబాద్, ఆగస్టు 16 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. శుక్రవారం మోపాల్ మండల కేంద్రంలో రుణమాఫీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న వేళ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఊహించని ఘటన ఎదురైంది.
ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించాలని యోచించిన ఆయనకు అనుమతి లేదంటూ స్థానిక సీఐ అభ్యంతరం తెలుపడంతో అయోమయానికి గురైనట్టు తెలిసింది. ‘ఇదంతా ఏమిటి? నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను. నా కార్యక్రమానికే అనుమతి నిరాకరిస్తారా?’ అంటూ తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు సమాచారం. ఎమ్మెల్యే నిరాశగా వెనుదిరిగినట్టు రైతులు చెబుతున్నారు. తనకు అవమానం జరిగిందని ఎమ్మెల్యే ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల ప్రదర్శనకు అనుమతి లేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యేకు ఎదురైన ఘటనపై స్పందించేందుకు నిరాకరించినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఇది జరిగిందని చెప్పుకొస్తున్నారు.