హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ హయాంలోనే సామాజిక న్యాయం జరిగింది..’ ఈ మాటలు అన్నది బీఆర్ఎస్ నేత కాదు, సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో లంబాడీ సామాజికవర్గానికి చెందిన ఒక్కరూ ఉండకూడదా? అని ఆయన ప్రశ్నించారు. మైదాన ప్రాంత గిరిజనులకు కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారని కొనియాడారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ నేపథ్యంలో ఆయన పెదవి విప్పారు. ‘ఇప్పటి వరకు మా సామాజికవర్గం లేకుండా ఏ క్యాబినెట్ లేదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 15 నెలలైనా మంత్రివర్గంలో మా లంబాడీ వాళ్లు లేరు’ అని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ‘ఏమన్నా అనండీ.. కేసీఆర్ హయాంలో సామాజిక న్యాయం జరిగింది. మా సామాజికవర్గానికి కేసీఆర్ ఎకడా అన్యాయం చేయలేదు. అయినా కాంగ్రెస్‌కు లంబాడీలు ఓట్లు వేశారు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు లంబాడీలకు మంత్రి పదవి దకలేదని చెప్పారు. తమ వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకునే విషయంలో అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. తమ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని, తాను కూడా రేస్‌లో ఉన్నానని తెలిపారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు మంత్రి పదవి కూడా తమ సామాజికవర్గానికి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
‘నేనే మంత్రి’ అనే ఆలోచన వారిది..
తమ జిల్లాలో (ఉమ్మడి నల్గొండ) ఒక నాయకుడు తనను ఎవరు కలిసినా ‘నేను మంత్రిని’ అనుకుంటారని, తనకు ఆయన (ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. పరోక్షంగా ఈ పేరు ప్రస్తావిస్తూ) లాగా మంత్రి పదవి కావాలనే సొంత డిమాండ్ లేదని బాలు నాయక్ పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలనేది తమ సామాజికవర్గం నుంచి వస్తున్న డిమాండ్ అని చెప్పడం గమనార్హం.