MLA Adinarayana | చండ్రుగొండ, సెప్టెంబర్ 26: పల్లెల్లో సమస్యలు తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్ గ్రామంలో చేపట్టిన ‘రచ్చబండ’.. ప్రజల తిరుగుబాటుతో రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ఎమ్మెల్యేపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో గ్రామస్థులకు మైక్ ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ.. మహ్మద్‌నగర్ గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే అధికారుల సమక్షంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపారు.
తాను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే.. వాటిని పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వెంటనే గ్రామస్థులు కమాల్, లాల్ అహ్మద్, కరీంబీ, హుస్సేన్, బాద్షా, అజ్గర్, ఖాసీలు తమ గ్రామంలోని సమస్యలను ఏకరువుపెట్టారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతుల రుణమాఫీ పూర్తిగా కాలేదని, పెంచిన పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. గ్రామంలో ఐదు నిమిషాలకోసారి కరెంటు పోతున్నదని, తాగునీరు సైతం సక్రమంగా సరఫరా చేయడం లేదని, కొత్త ఇండ్లు నిర్మించుకుంటే ఇంటి నెంబర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు గ్రామస్థులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కలుగజేసుకొని వారిని సముదాయించారు. టెక్నికల్ సమస్యతో రుణమాఫీ కాని వారికి త్వరలోనే అవుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.