వరంగల్ : మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి చెరువులో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ముదిరాజ్ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి సంబంధించిన రూ.10 లక్షల ప్రొసీడింగ్ కాపీని గ్రామస్తులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మత్స్య కార్మికుల కష్టాలు తీరాయని, వారు ఆర్థికంగా ఎదిగాలని, డబ్బులు పెట్టి చేపపిల్లలను పెంచే స్తోమత లేని వారికి వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మత్స్య కార్మికుల కోసం సొసైటీ ఏర్పాటు చేసి హక్కులు కల్పించిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టం చేశారు.