హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌశిక్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గేటు ఎక్కి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. సవాళ్లు ప్రతిసవాళ్ల నడుమ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ కొండాపూర్లోని కౌళిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకున్నది. అయితే ఎమ్మెల్యే గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ గేటు ఎక్కి ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యతిరేక అనుకూల నినాదాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపైకి ఎమ్మెల్యే గాంధీ అనుచరులు కుర్చీలు విసిరేశారు. కాగా, కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.. అరికెపూడి గాంధీని మాంత్రం వదిలేశారు. ఏకంగా తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటిపై దండయాత్రకు వెళ్లారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.