మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల, డిసెంబర్ 15: జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) ఘోర పరాజయం చెందడం.. సొంత ఊర్లో కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలువకపోవడంతో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (Anirudh Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామస్తులను ఓట్లు అడిగే క్రమంలో అభ్యర్థులు చేసే అభ్యర్థనను కూడా ఆయన గేలి చేసి మాట్లాడారు. ‘గెలిపించకపోతే పురుగుల మందు తాగి చస్తామంటున్నరు.
బీఆర్ఎస్ సర్పంచులు ఒకవేళ గెలిచినా నేనే చంపేస్తా.. ఎందుకంటే వారికి నిధులు ఇచ్చేది కూడా నేనే’ అంటూ ఎమ్మెల్యే అహంకారపూరితంగా మాట్లాడటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పంచాయతీ ఎన్నికల చివరి రోజు ప్రచారం సందర్భంగా బాలానగర్ మండలం చిన్నరేవల్లి, జడ్చర్ల మండలం గంగాపూర్‌లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇందిరమ్మ ఇల్లు కావాలంటే నేనే సంతకం పెట్టాలి.. రేషన్ కార్డులు కావాలంటే నేనే ఇయ్యాలి.. మరి మా ఊర్లో కాంగ్రెస్‌ను ఓడించి నన్ను గుండెలమీద కొట్టారు’ అంటూ ప్రజల మీదికే ఆగ్రహంతో ఊగిపోయారు.