అలంపూర్ చౌరస్తా, నవంబర్ 11 : రైతులు పండించిన పత్తిని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీసీఐ అధికారుల ను నిలదీశారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లును ఎమ్మెల్యే సందర్శించారు. ఆయనతో రైతులు తమ పత్తిని కొనుగోలు చేయడంలేదని గోడు వెల్లబోసుకున్నారు. వాహనాలను వెనక్కి పంపిస్తున్నారని చెప్పడం తో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే అధికారుల వద్దకు వెళ్లి నిలదీశారు. కొర్రీలు ఎందుకు పెడ్తున్నారని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

తేమ శాతం సడలించి పత్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బేలలోని అంతర్రాష్ట్ర రహదారిపై మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. రహదారిపై ఎడ్లబండ్లు, పత్తి ట్రాక్టర్లు అడ్డుపెట్టి నిరసన తెలిపారు. ఎస్సై ప్రవీణ్ సూచన మేరకు రోడ్డుపై ఆందోళన విరమించి మారెట్ కాంటా వద్ద నిరసన వ్యక్తంచేశారు. పత్తిని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.
రుద్రూర్, నవంబర్11 : డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులు ఇప్పించాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో బొప్పాపూర్ గ్రామస్థులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఇండ్లు నిర్మించుకుని రోజులు గడుస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదని రోడ్డుపై బైఠాయించారు.

గత ప్రభుత్వ హయాంలో బొప్పాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకున్న కొంతమందికి ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో రుద్రూర్లో ఆందోళన చేపట్టారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిస్తే బిల్లులు పెండింగ్‌లో లేవంటున్నారని వాపోయారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.