జగిత్యాల, మే 18: ‘ఎన్నికల ముందు మన ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తానని నమ్మించినవ్. అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టినవ్.. పైసల్లేవ్ అన్నవ్.. కానీ ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల చొప్పున బంగారం ఇచ్చేందుకు పైసలెక్కడియ్? సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్లు అంత బంగారమయ్యారా?’ అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మహిళలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలకు పెండ్లి కానుక పేరు మీద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాలా తీసిందని, ఎక్కడ అప్పు పుడుతలేదని ప్రకటనలిస్తూ పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ‘నన్ను కోసినా రూపాయి కూడా రాదు’ అని ఇటీవల ఓ మీటింగ్‌లో మాట్లాడిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అందాల పోటీలకు వచ్చిన అమ్మాయిలకు ఒక్కొక్కరికి 30 తులాలు ఇచ్చేందుకు రూ.200 కోట్లు ఎకడి నుంచి వచ్చాయో? చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎవరి మెప్పు కోసం ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ‘మీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారా? ఈ సుందరీమణులు వేశారా?’ అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ పేద ఆడ బిడ్డలపై లేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నరకాలంలో పెండ్లి చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం ఇవ్వాలని డి మాండ్ చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఫార్ములా రేస్‌తో తెలంగాణకు రూ.750 కోట్ల లాభం వచ్చిందని, అందాల పోటీలతో వచ్చిన లాభం ఏమీ లేదని, ఖజానాకు రోజుకు రూ.30 కోట్ల ఖర్చు తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు రేవంత్ సర్కార్‌కు తగిన బుద్ధి చెప్తారన్నారు.