ఎట్లుండె తెలంగాణ ఎట్లయింది? ఈ చిత్రాలను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం లేదూ? ఓ దిక్కు వడ్లు అమ్ముకొనేందుకు రైతన్నల అగచాట్లు! మరో దిక్కు ‘పరువు’ పేరుతో కూలిపోతున్న పేదల ఇండ్లు! ఇంకోవైపు విదేశీ యువతుల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు! ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ‘మార్పు’? దీని కోసమేనా? తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నది? పదేండ్ల పాటు దేశవ్యాప్తంగా వెలిగిన తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతికి దిగజార్చేందుకా ‘మార్పు’ను కోరుకున్నది?
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం కలిగించేలా వ్యవహరించింది. ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాల దగ్గర పెట్టింది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా 20 దేశాలకు చెందిన అందాల భామలు బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం కట్టు, బొట్టుతో హాజరయ్యారు. వారు గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఆడబిడ్డలు వాళ్లకు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ సుందరీమణి కాళ్లు కడుక్కున్న తర్వాత.. తుడవాలంటూ టవల్ను ఎదురుగా ఉన్న మహిళకు ఇచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కాళ్లు తుడవాల్సి వచ్చింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన అతిథికి కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వడం ఆనవాయితీ అని, ఇలా కాళ్లు తుడిపించడం ఏమిటని మండిపడుతున్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంత దారుణమా? అంటూ పోస్టులు పెడుతున్నారు.
తెలంగాణ ఆడబిడ్డతో కాళ్లు తుడిపించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ నేతలు కవరింగ్ మొదలు పెట్టారు. ‘ప్రపంచ అందగత్తెల పోటీదారులు తెలంగాణ సంప్రదాయాన్ని, సంస్కృతిని పాటించేలా మన ఆడపడుచులు చేశారు. మర్యాదకు, బానిసత్వానికి తేడా ఉంది’ అంటూ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘గుడిలోకి పోయేముందు ఇత్తడి పల్లెంలో కాళ్లు కడిగి, తుడిచే సంప్రదాయం ఎక్కడున్నది?’ అని కౌంటర్లు వేస్తున్నారు.
‘మన సంప్రదాయం చూపించాలంటే కాళ్లు కడిగి తుడవడం ఏమిటి?. ఇదేం మర్యాద?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబుస్తున్నదని విమర్శిస్తున్నారు. మరోవైపు అందాల భామల పర్యటనలో పోలీసు శాఖ కింది స్థాయి సిబ్బందితో నీళ్లు అందించే పనులు చేయించారని స్థానికులు చెప్తున్నారు. రక్షణ విధులు నిర్వహించాల్సిన సిబ్బందితో నీళ్లు మోపిస్తారా? అంటూ మండిపడుతున్నారు.