హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అత్యద్భుత, అపురూప, అద్వితీయ కట్టడమైన సచివాలయం ఆదివారం సందడిమయమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో కళకళలాడింది. మంత్రులు తమ కుటుంబసభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి చాంబర్లలో ఆసీనులై నూతన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సీఎంతో సహా మంత్రులు వివిధ ఫైళ్లపై తొలి సంతకం చేసి సంక్షేమ ముద్ర వేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ఉదయం నుంచే రావటం మొదలైంది. పలువురు ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. సీఎంతోపాటు మంత్రుల చాంబర్లలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జడ్పీ చైర్మన్లు, మేయర్లు, కలెక్టర్లు సచివాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరై అపురూప ఘట్టాన్ని ఆశ్చర్యానందాలతో తిలకించారు.
సెల్ఫీల సందడి
సెక్రటరియేట్ సెల్ఫీ పాయింట్‌గా మారింది. ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజాప్రతినిధు లు, ఉన్నతాధికారులు ఫొటోలు దిగి అరుదైన చిత్రంగా పదిలపరుచుకున్నారు. మంత్రులతో వారి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఫొటోలు దిగుతూ ఆనందం పంచుకున్నారు. సచివాలయలోకి రాలేని వారు సైతం బయటి నుంచే సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. సచివాలయ ప్రారంభం సందర్భంగా ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. మంత్రి వేముల నేతృత్వంలో సాయంత్రం ఆరున్నర గంటల నుంచి వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టు ఏజెన్సీకి చెందిన ప్రతినిధులు భారీగా బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు.
సాగరతీరాన నవరత్నశోభ
చూడ రెండు కండ్లుచాలని సంభ్రమాశ్చర్యాలకు నూతన సచివాలయం వేదికైంది. అన్ని రంగాల్లో తెలంగాణను దిక్సూచిగా నిలిపిన వర్తమానమే దేశ భవిష్యత్తుకు పునాది అని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎంతోమంది నూతన సచివాలయంలో తన్మయత్వానికి లోనయ్యారు. పాలనాభవనం పాలపుంతను ఆవిష్కరించింది.