Congress | వరంగల్, మే 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు సరిగా జరగడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు వారాలు గడిచినా వడ్లను మిల్లులకు తరలించడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి వసతులు ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల సమీక్ష సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వాస్తవాలతో ఫిర్యాదులు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోలుపై పౌర సరఫరాల మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ శనివారం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ వడ్ల కొనుగోలు ప్రక్రియలో సమస్యలను వివరిస్తూ అసంతృప్తి వ్యక్తంచేశారు. కాంటాలు ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు త్వరగా చేరవేయడం లేదని ఫిర్యాదు చేశారు. వడ్లు కల్ల్లాల్లోనే ఉండటంతో అకాల వర్షాలతో తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్లు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చాలా జాప్యం జరుగుతున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా బస్తాలు లేవని చెప్పారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించేందుకు లారీలు ఉండడం లేదని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని కోరారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యవుతున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
ధాన్యం దిగుబడిలో ఉమ్మడి ఏపీ రికార్డును తెలంగాణ అధిగమించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని అన్నారు. రెండు సీజన్లలో తెలంగాణలో పండినంత ధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో పండలేదని వివరించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.