హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రెండేండ్లలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సచివాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు, లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం బ్రాహ్మణవెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ సీం కెనాల్స్‌ను యుద్ధప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ కాలువలు, వరద కాలువకు మరమ్మతులు చేపట్టాలని, బెడ్, సైడ్స్ లైనింగ్ పనులను ఈ ఏడాదిలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ మురళీధర్‌రావు, చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.