న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల అమెరికాతో ఖరారు చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో నిప్పులు చెరిగారు. ఇందుకు మోదీ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన తీవ్రంగా విమర్శించారు. వారం రోజుల ప్రతిష్టంభన అనంతరం బుధవారం లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు ప్రసంగిస్తూ భారత్‌ను మోదీ సర్కార్ అమ్మివేసిందని ఆరోపించారు.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ద్వారాలు తెరవడం ద్వారా ప్రభుత్వం భారతీయ రైతుల పొట్ట కొట్టిందని రాహుల్ ఆరోపించారు. మీరు(ప్రభుత్వం) భారత్‌ను అమ్మేశారు. భారత్‌ను అమ్మినందుకు మీకు సిగ్గుగా లేదా? అంటూ రాహుల్ మండిపడ్డారు. భారతీయ ఇంధన భద్రతను అమెరికా చేతుల్లో పెట్టి, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడి కేంద్ర ప్రభుత్వం టోకుగా లొంగిపోయిందని ఆయన ధ్వజమెత్తారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇండియా కూటమి ప్రభుత్వం చర్చలు జరిపి ఉంటే భారత్‌ను మీతో సమానంగా చూడమని ట్రంప్‌నకు చెప్పి ఉండేదని రాహుల్ చెప్పారు. ఇది పూర్తిగా లొంగిపోవడమే. ఇది చాలా విషాదకరం. ఇది కేవలం ప్రధాని లొంగిపోవడం కాదు. 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును ఆయన పణంగా పెట్టారు. అమెరికాలో కేసును ఎదుర్కొంటున్న బీజేపీ ఆర్థిక నిర్మాతను కాపాడేందుకే ప్రభుత్వం ప్రజల భవిష్యత్తును త్యాగం చేసింది అని రాహుల్ ఆరోపించారు.