బడంగ్‌పేట కార్పొరేషన్, తుక్కుగూడ మున్సిపాలిటీ విలీనం సమయంలో జరిగిన నిధుల గోల్ మాల్ కలకలం రేపుతున్నది. ప్రజా ధనం దుర్వినియోగంపై సీఎం, చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, సీడీఎంఏ, జిల్లా కలేక్టర్, ఏసీబీ , విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు నిధుల అవకతవకలపై ఆరా తీశారు. అయితే ఈ గోల్మాల్ తతంగం వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నేత రింగ్ లీడర్‌గా వ్యవహరించినట్లు సమాచారం.
బడంగ్పేట్, ఫిబ్రవరి11 : బడంగ్పేట్ కార్పొరేషన్, తుక్కుగూడ మున్సిపాలిటీ విలీనం సమయంలో జరిగిన నిధుల గోల్మాల్ కలకలం రేపుతోంది. నిధుల దుర్వినియోగం సమస్య రోజుకో మలుపు తిరుగుతున్నది. అధికారులకు, కాంట్రాక్టర్ల మధ్యన వివాదం ముదిరి చిలికిచిలికి గాలి వానగా మారింది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజా ధనం దుర్వినియోగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, సీడీఎంఏ, జిల్లా కలెక్టర్, ఏసీబీ,విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తుక్కుగూడ, బడంగ్పేట్లో నిధుల గోల్ మాల్‌పై ఆరా తీశారు.
జరిగిన అవకతవకలపై ఫైల్స్‌ను పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు ఇంజినీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగంకు సంబంధించిన ఫైల్స్‌తోపాటు టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, అకౌంటెంట్ విభాగాలకు సంబంధించిన ఫైల్స్ తీసుకెళ్లినట్లు సమాచారం. జరిగిన అవకతవకలకు ఓ అధికార పార్టీ నేత రింగ్ లీడర్‌గా వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రింగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్న నేతకు ఓ అధికారి పూర్తిస్థాయిలో సహకరించడం వల్లనే అవకతవకలు జరిగినట్లు చర్చ జరుగుతున్నది. ఇంజినీరింగ్ విభాగంలో 400 నుంచి 500 ఫైల్స్, శానిటేషన్‌లో లక్ష ఫైల్స్‌పై వస్తున్న అభియోగాలకు వెనుకాల పెద్ద కుట్ర దాగి ఉందని చర్చ జరుగుతున్నది.
రెండేండ్లలో జరిగిన అన్ని ఫైల్స్‌ను పరిశీలించాలని కొంత మంది కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఫైల్స్ మాత్రమే కాదు గతంలో జరిగిన అన్ని ఫైల్స్‌ను పరిశీలించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. బడంగ్పేట్లో కొంత మంది కాంట్రాక్టర్లకు అధికారులు పెద్దపీట వేసి కొంత మంది కాంట్రాక్టర్లను పక్కన పెట్టడం వలన సమస్య వచ్చిందని చర్చించుకుంటున్నారు.
నిజంగా పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పని చేయని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారని ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల మధ్యన జరుగుతున్న గొడవలను సద్దుమణిగించడానికి ఓ అధికారి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. పూర్తి స్థాయిలో విచారిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.
బడంగ్పేట్ సర్కిల్లో ఓ అధికారి అంతా తానై నడిపిస్తున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. అన్ని విభాగాలపైన ఆధిపత్యం చెలాయిస్తూ సమస్యలకు ఆయనే కారణమని కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. అన్ని విభాగాల్లో తలదూర్చుతూ లక్ష ఫైల్స్‌కు కారణభూతమైనట్లు తెలుస్తోంది. విలీనం సమయంలో రాత్రి ఇదంతా చేసినట్లు చర్చించుకుంటున్నారు. అధికారులను తప్పుద్రోవ పట్టించినట్లు తెలుస్తున్నది. అంతా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అందరితో మంతనాలు చేస్తూ ఫిర్యాదులు చేస్తున్న వారితో సయోధ్య కుదుర్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
పనులు చేయకుండానే నిధులు నొక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలకు దొరక్కుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. కోట్ల రూపాయల నిధులు కాజేసేందుకు బిగ్ స్కెచ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే పనిని వంద ముక్కలుగా విభజించి బిల్లులు ైక్లెమ్ చేయడం పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి నిధులు గోల్‌మాల్‌కు తెరలేపారని ఆరోపణలు వస్తున్నాయి. తుక్కుగూడలో అధికారులు పది శాతం పర్సెంటేజ్ తీసుకొని బిల్లులు ఇచ్చారన్న విజిలెన్స్, ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. విలీన సమయంలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులను ఎదుర్కొవడానికి అధికారులు ముల్లగుల్లాలు పడుతున్నారు.
బడంగ్పేట్ సర్కిల్ జరిగిన నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టడానికి అధికారులు కాంట్రాక్టర్లతో వరుస సమావేశాలు పెడుతున్నారు. ఉదయం ఒక అధికారి, మధ్యాహ్నం మరో అధికారి, సాయంత్రం ఇంకా కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవకతవకలపై ఎవరు ఫిర్యాదులు చేయకూడదని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. సమావేశంలో అధికారులు, కాంట్రాక్టర్ల మధ్యన వాగ్వివాదం చోటుచేసుకున్నది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ వేశారని కాంట్రాక్టర్లు అధికారులను అడిగారు. కాంట్రాక్టర్లు ఎక్కడ పనులు సక్రమంగా చేయలేదని సమావేశంలో లొల్లి జరిగింది. దీంతో నిధుల దుర్వినియోగం కథ మొదటికి వచ్చింది. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది.