RTC Strike | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిషారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జేఏసీ నేతలతో చర్చలు జరుపుతామని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు. కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికారు.
మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు. భావోద్వేగాలతో సమస్యలు పరిషారం కావని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఆర్టీసీకి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ కానుక ఇచ్చామని, శంకర్‌గౌడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.