Singur Dam |అధికారం అండగా ఉంటే..ఖాళీ స్థలాలు, సర్కారీ భూములే కాదు ప్రాజెక్టులనూ ఆక్రమించవచ్చని నిరూపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏకంగా సింగూరు ప్రాజెక్టు ముంపుభూముల కబ్జాకే దిగాడు ఓ బడా మంత్రి బామ్మర్ది! సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూరు మరమ్మతుల కోసం ప్రాజెక్టు నుంచి నీటిని అధికారులు ఖాళీ చేస్తుండగా.. క్రమంగా ముంపు భూములు తేలుతున్నాయి. దీన్ని ఆసరా చేసుకొని, అదను చూసుకొని ఓ మంత్రి బంధువు రాబందులా ఆ భూములపై వాలిపోయాడు. తన ఫామ్‌హౌస్ పక్కనే తేలిన ముంపు భూములను కబ్జా చేసేందుకు స్కెచ్ వేశాడు.
నేరుగా భూములు ఆక్రమిస్తే.. వాటిని ప్రభుత్వానికి ఇచ్చిన రైతుల నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, దేవుడి ముసుగు తొడిగాడు మంత్రిగారి బామ్మర్ది. శివాలయం నిర్మిస్తామంటూ 20 ఎకరాలను చదును చేస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న మరో 200 ఎకరాలను కబ్జా చేసేందుకు వ్యూహం పన్నాడు. మళ్లీ డ్యామ్‌లోకి నీళ్లు వదిలితే మునిగిపోతాయి కదా? అనే అనుమానం రావొచ్చు. అందుకే అవి మునగకుండా ఎత్తు పెంచి రోడ్లు వేస్తున్నాడు. అడ్డుకట్టలు ఏర్పాటు చేస్తున్నాడు. తన ఫామ్‌హౌస్ మునిగిపోకుండా ఉండేందుకు ఇప్పటికే రెండు కుంటలను ధ్వంసం చేసి, తూములను తొలగించి, కట్టలు నిర్మిస్తున్నాడు. ఏకంగా సింగూరు డ్యామ్ ఎఫ్టీఎల్ను మార్చేందుకు కుట్రలు చేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం గానీ, ఇరిగేషన్ అధికారులుగానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములకే కాదు ప్రాజెక్టుల ముంపు భూములకూ రక్షణ లేకుండా పోతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టు ముంపు భూములపై కాంగ్రెస్ నేత, ఓ బడామంత్రి సమీప బంధువు కన్నుపడింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సింగూరు ప్రాజెక్టు ఉన్నది. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో పుల్కల్, వట్పల్లి మండలాల్లోని రైతులకు చెందిన వందల ఎకరాల పట్టా, అసైన్డ్ భూములు మునిగిపోయాయి. వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. దీంతో ఆ భూములపై ఇప్పుడా రైతులకు ఎలాంటి హక్కులూ లేవు. ఇటీవల సింగూరు ప్రాజెక్టు గోడలకు పగుళ్లిచ్చిన క్రమంలో మరమ్మతులు చేసేందుకు నీటిని ఖాళీ చేస్తున్నారు. మంజీరా జలాలను పూర్తిగా దిగువకు వదలడంతో గతంలో మునిగిన భూములు పైకి తేలుతున్నాయి. ఇలా వట్పల్లి మండలం ఖాదిరాబాద్, సాయిపేట, పుల్కల్ మండలం మంతూరు తదితర గ్రామాల ముంపు భూములు తేలాయి.
ఖాదిరాబాద్, మంతూరు శివారులో ఓ మంత్రి సమీప బంధువుకు 70 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉన్న ది. దాని పక్కనే ఉన్న రైతుల అసైన్డ్ భూములతోపాటు సింగూరు ముంపు భూములను ఆక్రమించి విస్తీర్ణాన్ని వంద ఎకరాలకు పైగా పెంచుకున్నట్టు ఇ ప్పటికే ఆరోపణలున్నాయి. తాజాగా ప్రాజెక్టును ఖాళీ చేయడంతో మంత్రి బంధువు ఫామ్‌హౌస్ పక్కనే ఖాదిరాబాద్, సాయిపేట గ్రామ శివారులోని 420, 422, 422/2, 444 సర్వే నంబర్లలోని ముంపు భూములు పైకితేలాయి. దాంతో ఈ భూములపై ఓ రాష్ట్ర మంత్రి బంధువు కన్నుపడింది. ఫామ్‌హౌస్ విస్తీర్ణాన్ని పెంచుకోవడంతోపాటు భవిష్యత్తులో సింగూరు ప్రాజెక్టుకు వరద వచ్చినా, తన భూములు మునిగిపోకుండా ఉండేందుకు ప్లాన్ వేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముంపు భూములను బహిరంగంగా ఆక్రమిస్తే రైతులు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని మంత్రి బంధువు భావించాడు. తన ప్లాన్‌కు దేవుడిని అడ్డం పెట్టుకున్నాడు. ముంపు భూముల మధ్యలో శివాలయం నిర్మిస్తానని, టూరిజం అభివృద్ధి చేస్తానని ఖాదిరాబాద్, సాయిపేట గ్రామస్తులను నమ్మబలికాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముంపు భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఇరిగేషన్ అధికారులు సింగూరు ప్రాజెక్టు అధికారులు ఖరారు చేసిన ప్రాజెక్టు ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)ను ఎవరూ మార్చడానికి వీలు లేదు. ముంపు భూముల్లో చెట్లను కొట్టేయడం, నిర్మాణాలు చేపట్టడం వాల్టా యాక్టు ప్రకారం చట్టవిరుద్ధ్దం.
అయితే ఈ నిబంధనలన్నీ మంత్రి బంధువు ముందు పనిచేయడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఆలయ నిర్మాణం పేరిట సుమారు 20 ఎకరాల ముంపు భూమిని పెద్దపెద్ద యంత్రాలతో చదును చేశారు. సింగూరు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపినా ఆ ప్రాంతం మునిగిపోకుండా ఉండేందుకు కృత్రిమంగా గుట్టను నిర్మించే పనులు చేపట్టారు. ఇందుకోసం నిబంధనలకు విరుద్ధ్దంగా ముంపు భూముల్లో నుంచే పెద్దఎత్తున మట్టి, మొరం తవ్వి పోస్తున్నారు. ఆలయ నిర్మాణం చేపడుతున్నామని చెప్పేందుకు చదును చేసిన ప్రాంతంలో కాషాయం జెండాలను పాతారు. తన అధికారబలం ఉపయోగించి ఖాదిరాబాద్ నుంచి శివాలయం నిర్మించే చోటువరకు విద్యుత్తు లైన్ ఏర్పాటు చేయిస్తున్నారు. ట్రాన్స్‌కో సిబ్బంది ఇప్పటికే కరెంటు స్తంభాలను వేశారు.
ఆలయ కోసం నిర్మాణాలు చేపట్టిన ప్రాంతంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న సుమారు 200 ఎకరాల భూమిని చదును చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయ నిర్మాణం అనంతరం ఈ 200 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు స్కెచ్ వేశారని చెప్తున్నారు. ఇందుకోసం ఏకంగా సింగూరు ప్రాజెక్టు ఎఫ్టీఎల్నే చెరిపివేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. తన అధికార బలాన్ని ఉపయోగించి, ఆ భూములకు పట్టా నంబర్లు వేసి, ఆక్రమించుకోవాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ భూముల విలువ సుమారు రూ.400 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
ఖాదిరాబాద్ గ్రామ పరిధిలోని తేలిన ముంపు భూముల్లోని సర్వే నెంబరు 444, 444/1, 444/2, సర్వే నెంబరు 442, 442/1 లో రెండు కుంటలు ఉన్నాయి. అవే కొరివికుంట, నల్లకుంట. వీటి విస్తీర్ణం 18 ఎకరాల వరకు ఉంటుంది. సింగూరు ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఈ రెండు కుంటల కింద ఖాదిరాబాద్ గ్రామ రైతులు వ్యవసా యం చేసేవారు. ఇటీవల ప్రాజెక్టు ఖాళీ చేయటంతో కొరివికుంట, నల్లకుంట సైతం తేలాయి. ముంపు భూముల్లో ఉన్న ఈ రెండు కుంటలను మంత్రి బంధువు ధ్వంసం చేశాడు. వాటి తూములను తొలగించి, ఈ రాళ్లను తన ఫామ్‌హౌస్‌కు తరలించాడు. ముంపుభూముల్లో నుంచి మట్టిని తెచ్చి, ఆ రాళ్లతో ఫామ్‌హౌస్‌కు రక్షణగా కట్టను నిర్మిస్తున్నాడు. అంతేకాదు ముంపు భూముల్లోని మట్టి, రాళ్లతో తన ఫామ్‌హౌస్‌కు రోడ్డు వేసుకుంటున్నాడు. నిబంధనల ప్రకారం ముంపు భూముల్లోని ఎలాంటి నిర్మాణాలను తొలగించరాదు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నీటిపారుదలకు వినియోగించున్న కుంటలు, చెరువుల నిర్మాణాలను ప్రైవేట్ వ్యక్తులు తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అయినా మంత్రి బంధువు అధికార బలం ముందు ఇవేమీ పనిచేయడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు, ముంపు భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వట్పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామ పరిధిలో సింగూరు ముంపు భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఆలయం నిర్మాణ పనులు చేపడుతున్న విషయంపైనా సమాచారం లేదు. త్వరలోనే ఇరిగేషన్ అధికారులతో కలిసి ఖాదిరాబాద్, సాయిపేట గ్రామ పరిధిలోని ముంపు భూములను పరిశీలిస్తాం. ముంపు భూములను ఎవరైనా ఆక్రమించినా, నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం.
– జంగేశ్వర్, వట్పల్లి తహసీల్దార్
వట్పల్లి మండలం ఖాదిరాబాద్, సాయిపేట గ్రామాలతోపాటు పుల్కల్ మండలం మంతూరు గ్రామ శివారులోని సింగూరు ప్రాజెక్టు ముంపు భూములను మంత్రి బంధువు ఆక్రమించుకుంటున్నారు. గుడి కడుతున్నట్టు గ్రామస్తులను, రైతులను నమ్మించి, 200 ఎకరాల ముంపు భూమిని కబ్జా చేసేందుకు స్కెచ్ వేశారు. సింగూరు ప్రాజెక్టు ఎఫ్టీఎల్ను చెరిపివేయడంతోపాటు ముంపుభూముల్లోని రెండు కుంటలను మంత్రి బంధువు తొలగించారు. అక్రమ నిర్మాణాలతో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నది. దీంతోపాటు మంజీరా జలాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. వెంటనే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు విచారణ జరిపి ముంపు భూములను రక్షించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి.

సింగూర్ ముంపు భూముల్లో అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను క లిసి ఫిర్యాదు చేశారు. ఖాదిరాబాద్, సాయిపేట్ గ్రామాల పరిధిలోని ప్రాజెక్టు ముంపు ప్రాంతా ల్లో చెరువుల ధ్వంసం, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రా జెక్టు మరమ్మతుల కోసం నీటిని ఖాళీ చేసిన నేపథ్యంలో ఇదే అదనుగా మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్‌రెడ్డి, అతని అనుచరులు వందల ఎకరాల్లో ప్రభుత్వ, ముంపు భూ ములను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఖాదిరాబాద్ గ్రామ పరిధిలోని కొ రివికుంట, నల్లకుంట చెరువులను భారీ యంత్రాలతో పూర్తిగా ధ్వంసం చేశారని, కట్టలు, తూము లు తొలగించి చెరువుల ఆనవాళ్లు లేకుండా చేశారని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోని దాదాపు రెండెకరాల భూమిని ఆక్రమించి మట్టితో నింపి ప్రైవేట్ రిసార్ట్లు, బోటింగ్ కోసం చదును చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. పేద రైతు ల భూములను ఆక్రమించుకోవడంతోపాటు రై తులు తమ పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలో అనుమతులు లేకుండా విద్యుత్తు లైన్లు కూడా ఏర్పాటు చేసినట్టు సూచించారు. ఈ వ్యవహారంపై రెవె న్యూ, ఇరిగేషన్ శాఖలతో సంయుక్త సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్ హద్దులను నిర్ధారించాలని కోరారు. ఆక్రమణలను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.