హనుమకొండ, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /పెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ)/యాదగిరిగుట్ట: రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు తీవ్రమవుతుండటంతో సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తున్నది. ఎట్టకేలకు ధాన్యం కొనుగోలుపై హనుమకొండ, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో మంత్రులు ఉత్తమ్, దుద్దిళ్ల, పొంగులేటి సమీక్షలు నిర్వహించారు. ఆయా చోట్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 8 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. ఇంకా 15 నుంచి 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నట్టు చెప్పారు.
వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడ్లు, మొక్కజొన్నల కొనుగోలుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, యశస్వినీరెడ్డి సమీక్ష సమావేశానికి హాజరుకాలేదు. వడ్ల కొనుగోలుపై మూడు గంటలపాటు సమీక్ష నిర్వహిస్తామని అధికారులకు సమాచారం ఇచ్చిన మంత్రులు అరగంటలో ముగించారు. వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, రైతుల ఇబ్బందులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా ప్రశ్నలు వేయడంతో మంత్రులు అవాక్కయ్యారు.
ఎమ్మెల్యేలు ప్రస్తావించే అంశాలకు వివరణ ఇచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. వడ్ల కొనుగోలు ప్రక్రియలో లోపాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. దీంతో అధికారులు తమాషా చేయకుండా వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని రైతుల సమస్యలను ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.