జడ్చర్ల, సెప్టెంబర్ 25 : మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించేందుకు బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. మంత్రులను కలిసేందుకు అనుమతించకపోవడంతో ఉదండాపూర్ భూనిర్వాసితులు ఆగ్రహం వ్య క్తంచేశారు. వారి వద్దకు ఎంపీ మల్లు రవి, ఎమ్మె ల్యే అనిరుధ్‌రెడ్డి రావడంతో భూనిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. మంత్రులకు తమగోడు వినిపిస్తామంటే ఎందుకు వెళ్లనివ్వడం లేదని నిలదీశారు. రైతు ప్రభుత్వమని చెప్పే కాంగ్రెస్.. కర్షకులను అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. పది రోజుల కిందట పునరావాసం కింద పరిహారం పెంచి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే.. ఇప్పుడు మాట మార్చి రూ.16 లక్షలు మాత్రమే ఖాతాల్లో వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిహారం పెంచకపోతే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒకే రిజర్వాయర్‌లో రెండు రకాల ప్యాకేజీలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. పోలేపల్లి శివా రు రైతులకు ఎకరాకు రూ.12.50 లక్షలు ఇచ్చారని, అదే శివారుకు ఇవతల ఉన్న భూములకు రూ.5.50 లక్షలు మాత్రమే ఎలా ఇస్తారని నిలదీశారు. తమకు కూడా పోలేపల్లి రైతులకు ఇచ్చిన విధంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూ.45 కోట్లను విడుదల చేసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఉదండాపూర్తోపాటు ఇతర రిజర్వాయర్లలో ముంపునకు గురైన నిర్వాసితులకు న్యాయపరంగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆర్భాటం గా వెళ్లిన మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం అది పూర్తిచేయకుండానే వెనక్కి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు టైం అయిపోతున్నదని చెప్పి ప్రాజెక్టులపై ఎలాంటి సమీక్ష లేకుండానే, వట్టెం రిజర్వాయర్‌ను పరిశీలించకుండానే వెనుదిరగడం చర్చనీయాంశమైంది. భారీ వర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం శివారులోని నాగనూలు చెరువు, కుమ్మెర చెరువులు ఉప్పొంగడంతో ఆ బ్యాక్ వాటర్ కారణంగా వట్టెం పంప్‌హౌస్ నీటిమునిగింది. 16 కిలోమీటర్ల పొడవు, 9 మీటర్ల వ్యాసంతో ఉన్న 2 సొరంగాలు పూర్తిగా నీటితో నిండిపోయా యి. పంప్‌హౌస్ సైతం మునిగిపోయింది. మొత్తంగా 34 లక్షల క్యూబిక్‌మీటర్ల నీరు చేరిందని అధికారులు ప్రాథమికంగా అం చనా వేశారు. నీటి తోడివేత పనులు ఇప్పటికీ మందకొడిగా కొనసాగుతుండడంపై బీఆర్ఎస్ నేతలు, స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ బృందం సందర్శించింది.