Ravi Teja | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ విషయంలో ఒక కీలక మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఎదురవుతున్న పరాజయాలు సినిమా బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో, నిర్మాతలకు భారం తగ్గించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రిస్క్ కంట్రోల్ చేయడమే లక్ష్యంగా ఆయన తన రెమ్యూనరేషన్ విషయంలో కొత్త విధానాన్ని అవలంబిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా రవితేజ ఒక్కో సినిమాకు రూ. 20 నుంచి 25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దీనివల్ల సినిమా నిర్మాణ వ్యయం సుమారు రూ. 40 నుంచి 50 కోట్లు దాటుతోంది. ఒకవేళ భారీ చిత్రమైతే ఆ బడ్జెట్ కాస్తా రూ. 100 కోట్లకు చేరుతోంది. ఇటీవలి కాలంలో ఓటీటీ హక్కుల విలువలలో మార్పులు రావడం, మార్కెట్ పరిస్థితులు మారడంతో నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టి రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. రూ. 100 కోట్ల బడ్జెట్ అంటే ప్రాజెక్ట్ రద్దయ్యే ప్రమాదం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఈ సమస్యను అధిగమించేందుకు రవితేజ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిక్స్డ్ రెమ్యూనరేషన్‌ను కొంతవరకు తగ్గించుకుని, సినిమా ద్వారా వచ్చే లాభాల్లో వాటా (Profit Sharing Model) తీసుకునేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తుంది. దీనివలన సినిమా ప్రారంభంలో నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గుతుండడమే కాకుండా. సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో రవితేజకు వాటా దక్కుతుంది, ఒకవేళ ఫలితం తేడా కొడితే నిర్మాతకు నష్టం తక్కువగా ఉండబోతుంది. ఈ నిర్ణయం ద్వారా రవితేజ నిర్మాతలకు పూర్తి భరోసా కల్పించబోతున్నట్లు సమాచారం.
కేవలం రవితేజ మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా నాచురల్ స్టార్ నాని, సాయి ధరమ్ తేజ్, మరియు నందమూరి బాలకృష్ణ వంటి హీరోల ప్రాజెక్టుల విషయంలో కూడా ఇటువంటి చర్చలే నడుస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ అదుపులో ఉంటేనే సినిమా సేఫ్ జోన్లో ఉంటుందని టాలీవుడ్ స్టార్ హీరోలు గ్రహిస్తున్నారు. ఒకవైపు తన మార్కెట్‌ను కాపాడుకుంటూనే, మరోవైపు నిర్మాతలను కాపాడాలనే రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త మోడల్ రవితేజ తదుపరి చిత్రాలకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.