న్యూఢిల్లీ: లోధా డెవలపర్స్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ మాజీ డైరెక్టర్ రాజేంద్ర లోధా(Rajendra Lodha)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో అతన్ని ఈడీ అదుపులోకి తీసుకున్నది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా ఉన్న సమయంలో రాజేంద్ర లోధా సుమారు 85 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీల్యాండరింగ్ కేసులో రాజేంద్ర లోధాను కస్టడీలోకి తీసుకునేందుకు ఫిబ్రవరి 12వ తేదీన ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎల్డీఎల్ కంపెనీకి కావాలనే ఆయన సుమారు 85 కోట్ల నష్టానికి కలగచేసినట్లు లోధాపై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో క్రైం బ్రాంచ్ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ముంబై పోలీసులు లోధాపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధం ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. శుక్రవారం ఈడీ కోర్టు ముందు లోధాను ప్రవేశపెట్టనున్నారు.