Actress Rajisha Vijayan | ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే గడవని పరిస్థితి నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఎక్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో గంటల తరబడి గడుపుతూ వర్చువల్ ప్రపంచంలో మునిగితేలుతున్నారు. అయితే వీరందరికీ భిన్నంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన జీవనశైలిని ఏర్పరచుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది స్టార్ హీరోయిన్ రజిషా విజయన్.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార.. గత ఎనిమిదేళ్లుగా వాట్సాప్‌ను ఉపయోగించడం లేదని తెలిపి అందరినీ షాక్‌కి గురిచేసింది. కాలేజీ చదువు పూర్తికాగానే ఫేస్‌బుక్‌కు గుడ్‌బై చెప్పేసిన ఆమె ప్రస్తుతం కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ను మాత్రమే చాలా అరుదుగా వాడుతున్నట్లు తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రజిషా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ.. సోషల్ మీడియా మాయలో పడి విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం కంటే, నిజ జీవితానికే ప్రాధాన్యత ఇవ్వడం తనకు ఇష్టమని స్పష్టం చేసింది. వర్చువల్ బంధాల కంటే ప్రత్యక్షంగా మనుషులతో గడపడమే మిన్న అని ఆమె పేర్కొంది.
మాస్ మహారాజా రవితేజ సరసన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రజిషా, తన నటనతో మరియు క్యూట్ లుక్స్‌తో మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘కాలంకావల్’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించి మెప్పించింది. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ, సోషల్ మీడియా విషయంలో తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ కూడా కెరీర్లో ఎలా రాణించవచ్చో రజిషా విజయన్ నిరూపిస్తోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.