రంగారెడ్డి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) షాబాద్/ చేవెళ్ల రూరల్/ చేవెళ్ల టౌన్: బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ బస్సు ప్రమాదం జరిగిందని ఆగ్రహం పెల్లుబికింది. ఈ ప్రమాదానికి సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని బాధితుల కుటుంబీకులు, ప్రజలు నిరసనకు దిగారు. ఘటనాస్థలిని పరిశీలించడానికి వెళ్లిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యే శ్రద్ధ చూపకపోవడంతోనే బస్సు ప్రమాదం జరిగి 19 మంది మృతిచెందారని మండిపడ్డారు.
సీఎం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదా లు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసిం ది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎమ్మెల్యే యాదయ్యను కారు దిగకుండానే అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ మహేందర్‌రెడ్డితోపాటు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే లు మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య .. చేవెళ్ల ప్రభుత్వ దవాఖాన వద్ద మాట్లాడడానికి ప్రయత్నించగా, మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిధులు ఉన్నప్పటికీ రోడ్డు విస్తరణ చేపట్టకపోవడంపై వారు అసహనం వ్యక్తంచేశారు.