నిజామాబాద్: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు నిర్మించకుండా అడ్డుపడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.151 కోట్లు తిరిగి చెల్లించాలని కేంద్ర చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్ గుప్తాతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతు బంధు కింద ఇప్పటివరకు ప్రభుత్వం రూ.57 వేల కోట్లు, రైతు బీమా కింద రూ.4648 కోట్లు చెల్లించిందని తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోనే ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.లక్షా 7 వేల కోట్లతో ధాన్యం కొంటున్నామని చెప్పారు. ఏడేండ్ల కాలంలో రైతుల కోసం సీఎం కేసీఆర్ రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇతర రాష్ట్రాలకు మాత్రం కేంద్రం ఎఆర్జీఎస్ కింద కల్లాలు మంజూరు చేస్తున్నదని వెల్లడించారు. రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం రైతు మహా ధర్నా నిర్వహిస్తామన్నారు.