నిజామాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత సృష్టి అని, కేసీఆర్ సీఎంగా ఉండటం వల్లే ఈ ప్రాజెక్టు నిర్మితమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా వరద కాలువకు ఎదురెక్కి వస్తున్న కాళేశ్వర జలాలకు గురువారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కమ్మర్పల్లి శివారు నుంచి మొదలుకొని తొమ్మిది చోట్ల రైతులు, ప్రజలతో కలిసి జల సంబురాన్ని తిలకించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలందరితో కలిసి వరద కాలువ వెంట మారథాన్‌లా కార్యక్రమం నిర్వహించారు. ఆయా చోట్ల పూజలు చేసి, కాళేశ్వర గంగమ్మకు సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వర జలాలను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. నీళ్ల పరవళ్లతో తన జన్మ ధన్యమైందని అన్నారు.
‘రైతుల కల నెరవేరిన రోజు ఇది. ఎప్పటికైనా తెలంగాణ రైతులతో పాటు దేశ రైతాంగానికి కేసీఆరే శ్రీరామరక్ష. గోదారమ్మ ఎదురెక్కుతుందని కలలో కూడా ఊహించలేదు. సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ధన్యవాదాలు. నా హయాంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులు పూర్తి కావటం అదృష్టంగా భావిస్తున్నా. ఇక వర్షాలతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా రైతులకు సాగు నీరు అందుతుంది’ అని తెలిపారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని 300 కిలోమీటర్లు తరలించడం గొప్ప విషయమని చెప్పారు.
‘గోదావరి తెలంగాణకు కింది భాగంలో ఉన్నందున నీళ్లు పైకి రావని ఆనాడు ఆంధ్రా, తెలంగాణ నాయకులు కలిసి చెప్పారు. కానీ, ఒకే ఒక్కడు కేసీఆర్ నీళ్లకు ఎదురెక్కించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను తెలంగాణకు మళ్లించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీని నింపాలని అధికారులను సీఎం ఆదేశించారు. అందుకే రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 20 టీఎంసీలు నీళ్లున్నాయి. మరో 20 టీఎంసీలు కాళేశ్వరం ద్వారా నింపుకుంటే ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు సాగునీటి ఢోకా ఉండదు’ అని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.90 వేల కోట్లలోపే పనులు జరిగితే, రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని నిలదీశారు. ప్రతిపక్షాల అసంబద్ధ ఆరోపణలను తిప్పి కొట్టాలని రైతులకు మంత్రి వేముల పిలుపునిచ్చారు.
2017 ఆగస్టు 10న సీఎం కేసీఆర్ శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి భూమి పూజ చేశారు. 1,067 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అనతికాలంలో పూర్తి చేసుకొని ట్రయల్ రన్ లో భాగంగా వరద కాలువ వెంట నీళ్లను ఎదురెక్కించారు. తద్వారా వరద కాలువ వెంట వందల చెరువులకు నీళ్లు అందించారు. తొలిసారి ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీల నీరు తరలించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించటంతో ఎస్సారెస్పీ జలకళ సంతరించుకొన్నది.