Paddy Procurement | హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): యాసంగి మాదిరిగానే ఈ సీజన్లోనూ ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం, రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లలో పౌరసరఫరాల సంస్థ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలను పరిష్కరించకుండానే ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ధాన్యం కొనుగోలు నియమ నిబంధనలపై ఇప్పటివరకూ పాలసీని సిద్ధం చేయలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని దించుకునే మిల్లర్లతోనూ ఒప్పందాలు చేసుకోలేదు. మరోవైపు తమ సమస్యలు పరిష్కరించే వరకు ధాన్యం దించుకునేది లేదంటూ మిల్లర్లు ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. కొనుగోళ్లపై క్షేత్రస్థాయి అధికారులకు కూడా పూర్తిస్థాయిలో డైరెక్షన్ ఇవ్వలేదని తెలిసింది. పై స్థాయిలో ఒప్పందాలు, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయకుండా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై విమర్శలొస్తున్నాయి.
ఏటా ధాన్యం కొనుగోళ్లపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)తో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఒప్పందం కుదుర్చుకుని పాలసీని రూపొందిస్తుంది. సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో పాలసీని రూపొందిస్తారు. ఎంత ధాన్యం కొనుగోలు చేయాలి? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలి? మిల్లర్లకు, సీఎమ్మాఆర్కు ఎలాంటి నిబంధనలు విధించాలి? తదితర అంశాలు ఈ పాలసీలో ఉంటాయి. కానీ, అక్టోబర్ మొదటి వారం పూర్తయి, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించే సమయం వచ్చినా, పాలసీని రూపొందించలేదు. మరోవైపు కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తిచేశామంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పాలసీ లేకుండా ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా చేస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి, పౌరసరఫరాల సంస్థకు ధాన్యం కొనుగోళ్లపై ముందస్తు ప్రణాళిక లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పౌరసరఫరాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లర్లతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు మిల్లర్లతో ఒప్పందం చేసుకోలేదు. దీంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎవరు దించుకుంటారు? ఎక్కడ నిల్వ చేస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సన్న ధాన్యానికి సంబంధించి అవుట్‌టర్న్ రేషియోను తేల్చే వరకు తాము ధాన్యాన్ని దించుకోబోమని మిల్లర్లు తెగేసి చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం నుంచి 67% బియ్యం రావడం కష్టమని, 60% వరకే వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. మిగిలిన నష్టానికి ఎవరు బాధ్యులు, ఏం చేయాలో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ వివాదంపై స్పందించలేదు. దీంతో మిల్లర్లు కూడా బెట్టుదిగడం లేదు. ‘మేము దిగొస్తామని అధికారులు అనుకుంటున్నారేమో. ఆ పరిస్థితి అసలే లేదు. మేము నష్టాలను భరిస్తూ ప్రభుత్వానికి మేలు చేయాలా? అలా చేస్తే మా బతుకులు రోడ్డుపాలు కావడం ఖాయం’ అని ఒక మిల్లరు వ్యాఖ్యానించడం గమనార్హం. తాము నెల నుంచి సమస్యను అధికారుల దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నామని, కానీ, స్పందన లేదని చెప్పారు. ఒకవేళ ధాన్యం దించుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే, తమను బాధ్యులను చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. గతంలో జిల్లా అసోసియేషన్ ఆ జిల్లాలోని మిల్లర్లకు బాధ్యత వహిస్తూ లెటర్ ఇచ్చేది. కానీ ఈ సీజన్ నుంచి జిల్లా అసోసియేషన్ తరుపున మిల్లర్లకు లెటర్లు ఇవ్వొద్దని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లర్లు ఎవరికి వారే సొంతంగా సివిల్ సైప్లెకి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.
అక్టోబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై గత నెల 23న ఎంసీఆర్హెచ్ఆర్డీలో జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సైప్లె అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ మొదటి వారంలో నల్లగొండ, మెదక్ జిల్లాల్లో, రెండో వారంలో నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ మొదటి వారం పూర్తయినా రాష్ట్రంలో కనీసం ఒక్క కొనుగోలు కేంద్రమైనా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దసరా తర్వాత ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నట్టు తెలిసింది. మరోవైపు పలు జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి. దీంతోపాటు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.