పశ్చిమాసియా మరోసారి యుద్ధజ్వాలల్లో చిక్కుకున్నది. ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా ఇరాన్‌పై ఘోరంగా విరుచుకుపడింది. ఇరాన్ తనవంతుగా గట్టి ప్రతిఘటనే ఇస్తున్నది. ఈలోగా శత్రుదాడుల్లో ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ హతమయ్యాడు. మరికొందరు సీనియర్ నాయకులు కూడా రకరకాల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడ్డాయి. వైరివర్గాల మధ్య బలాబలాల సమతూకం లేదన్నది తెలిసిందే. ఇజ్రాయెల్ అప్రకటిత అణుశక్తి దేశం. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యం అమెరికా. ఇరాన్ కేవలం ఓ ప్రాంతీయ సైనికశక్తి మాత్రమే. ఇవి యుద్ధం తీరుతెన్నులను నిర్ణయిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే ఇజ్రాయెల్-అమెరికా మొదలుపెట్టిన ఈ యుద్ధం ప్రపంచశాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నదని చెప్పక తప్పదు. ఇరాన్ విధ్వంసం ఎటూ జరుగుతున్నది. ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలోని ఇరుగుపొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలపై జరుపుతున్న క్షిపణి దాడులతో పరిస్థితి చిలికిచిలికి గాలివానగా మారుతున్నది.మరో ప్రపంచయుద్ధంలోకి ప్రవేశించామా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం అంతిమంగా ఏ రూపం తీసుకుంటుందనేది అప్పుడే చెప్పగలిగే పరిస్థితులు లేవు.
అమెరికా యుద్ధోన్మాదంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఏరకంగా చూసినా ఇది సాంప్రదాయిక యుద్ధం కాదు. ఓవైపు ఇరాన్ సైన్యాన్ని నిర్వీర్యం చేస్తూనే మరోవైపు ఆ దేశం నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకొని తుదముట్టించే ఎత్తుగడను అమెరికా అమలు చేస్తున్నది. ఈ ధోరణి ఇటీవలి కాలంలో అగ్రరాజ్యానికి ‘ఇష్టమైన, ప్రమాదకరమైన’ క్రీడగా మారింది. దీనినే ‘రెజిమ్ చేంజ్ పాలసీ’గా పిలుస్తున్నారు. ఇరాక్ మొదలుకొని ఆఫ్ఘనిస్థాన్ వరకు దీనిని అమెరికా అమలు చేసింది. ఇందులో మొదటి అంకం, సదరు దేశంలోని ప్రభుత్వం ప్రమాదకర మారణాయుధాలు తయారు చేస్తున్నదనో లేక ఉగ్రవాదానికి అండదండలు అందిస్తున్నదనో అమెరికా ఎడతెరిపి లేకుండా ప్రచారం చేస్తుంది. ఆయా దేశాల ప్రజలను మాయోపాయాల ద్వారా తమ ప్రభుత్వం మీదనే తిరగబడాలంటూ రెచ్చగొట్టడం రెండో అంకంగా ఉంటుంది.
అస్థిర పరిస్థితులను కల్పించి ప్రత్యక్షంగా సైనికదాడికి తెగబడుతున్నది.ఇలా రకరకాల బూచిలను చూపించి అమెరికా యుద్ధాలకు దిగిన దేశాల్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన మాట వాస్తవం. ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థల ప్రమేయం లేకుండా అమెరికా ఇష్టారాజ్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇరాక్‌లో సద్దాంను గద్దె దింపారు. ఆపై బూటకపు విచారణ జరిపి ఉరితీశారు. లిబియాలో ప్రజాతిరుగుబాటు ముసుగులో గడాఫీని తుదముట్టించారు. మొన్నటికిమొన్న వెనెజువెలాలో అధ్యక్షుడు మదురోని కిడ్నాప్ చేశారు. అమెరికా ‘రెజిమ్ చేంజ్ విధానం’ అమలు చేసిన దేశాల్లో అల్లకల్లోలం, అరాచకత్వం తప్ప ఇంకేమీ మిగలలేదు. ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టయిందని చరిత్ర తెలియజేస్తున్నది. ఈ చరిత్రలో సింహభాగం ప్రపంచ చమురు వాణిజ్యంపై ఆధిపత్యం సాధించడం తప్ప మరోటి కాదు. ఇజ్రాయెల్‌కు ముప్పులేని పరిస్థితులు కల్పిస్తూ, ఇరాన్ చమురు వ్యాపారంపై ఆధిపత్యం సాధించడం అనేవి అమెరికా అసలు సిసలు, అంతిమ లక్ష్యాలు అనేది బహిరంగ రహస్యమే.
ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అధికార మార్పిడి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ వంటి లక్ష్యాలను యుద్ధ కారణాలుగా అమెరికా చెప్తున్నప్పటికీ అవి ఏమంత నమ్మదగ్గవి కాదనేది తెలిసిందే. ఆ రెండు అంశాలూ ఇరాన్ అంతర్గత వ్యవహారం కిందకే వస్తాయి. తమకు ఏరకమైన ప్రభుత్వం ఉండాలనేది తేల్చుకోవాల్సింది ఇరాన్ ప్రజానీకమే. కానీ బయటి దేశాలు కాదు. ‘తాటిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డి కోసం’ అన్నట్టు ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ రెజిమ్ చేంజ్ మంత్రాన్ని అమెరికా పదేపదే జపిస్తున్నది. ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనే సదాశయం అగ్రరాజ్యానికి ఉన్నట్టు అనుకోవడానికి లేదు. ఒకవేళ ఉన్నా అమెరికాకు ఆ అధికారం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం తప్పయితే ఇరాన్‌పై అమెరికా దాడి చేయడమూ తప్పే అవుతుంది. ప్రపంచ పోలీసుగా అమెరికాను ఎవరూ నియమించలేదని అగ్రరాజ్య నాయకత్వం గుర్తించడం మంచిది.