– బోరు నీటిని యదేచ్చగా వాడుతున్న వ్యాపారులు
– పడిపోతున్న భూగర్భ జలాలు
– అధికారుల పర్యవేక్షణ లేమి
కరకగూడెం, జూన్ 12 : మారుమూల ఏజేన్సీలో ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించిన కొందరు వ్యాపారులు మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ ప్రజలకు అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేసి కరకగూడెం మండల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మినరల్ వాటర్ పేరిట పుట్టగొడుగుల్లా ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. మరో వైపు శుద్ధ జలం అందిచడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగిరథ పథకం చేపట్టి మారుమూల గ్రామాలకు సైతం ఇంటింటికి గోదావరి శుద్ధ జలాలు అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో శుద్ధ జలాలను అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని గ్రామస్తులు బాహాటంగా విమర్శిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన ప్లాంట్ల నిర్వాహకులు మిషన్ భగిరథ నీటిపై గ్రామాల్లో దుష్పప్రచారం చేస్తున్నారు.
ముఖ్యంగా వాటర్ ట్యాంకులు శుభ్రపరచడం లేదని, వాటర్ పైపుల ద్వారా లీకేజీ అయ్యి తాగునీరు కలుషితం అవుతుందని, సరిపడా తాగునీరు రాదని చెబుతూ వారి వ్యాపారం పెంచుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన సంభందిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహించడానికి మైక్రో బయోలజీ, కెమికల్ ల్యాబ్ నిర్వాహకుడు ల్యాబ్ టెక్నిషియన్ అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ల్యాబ్ టెక్నియన్ కనిపించడు. బోరు నీటిని పంప్ చేసి కొంత రుచి కోసం స్వీట్ కెమికల్ పౌడర్‌ను కలుపుతారు. వాటిని మినరల్ వాటర్ క్యాన్లలో అలాగే ప్లాస్టిక్ డ్రమ్ములతో నింపి ఇష్టం వచ్చిన ధర నిర్ణయించి ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. వాటర్ ప్లాంట్లకు ఐఎస్ఐ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. కాని అలాంటి గుర్తింపు ప్లాంట్లు మండల వ్యాప్తంగా ఎక్కడ లేకపోవడం గమనార్హం.
మినరల్ వాటర్ ప్లాంట్లకు అనేక నిబంధనలు, అనుమతులు అవసరం ఉంటాయి. అయితే అవేమి ఇక్కడ కనిపించవు. గ్రామాల్లో చుట్టపక్కల ఇండ్ల మధ్యనే వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రాత్రి, పగలు అని తేడా లేకుండా నీటిని మోటర్ల ద్వారా తోడుతుండటంతో పక్కన గృహ సముదయాల్లో బోర్లు, బావులు ఇంకిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొదుపుగా వాడుకోవాల్సిన తాగునీరును ఇండ్ల మధ్యలో వ్యాపారులు వాటర్ ప్లాంట్ల నిర్వాహణకు బోర్లు వేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటి డబ్బులు పెట్టి తాగునీరు కొనుకున్నే పరిస్థితి దాపురిస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇటువంటి నీటిని త్రాగితే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలతో పాటు భయంకరమైన వ్యాధులు వచ్చే అవకావం ఉందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనధికారిక ప్లాంట్లను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం. ఇలాంటి వారిని వదలం. ప్లాంట్లను తనిఖీలు చేసి ప్రమాణాలు పాటించకపోతే నిర్వాహకులపై కఠిన చర్యలు చేపడతాం. అన్ని అనుమతులతోనే ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న శుద్ధ జలాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్ల నీటిని తాగడం సురక్షితం కాదు. ఇది ప్రజల ప్రణాలకే ప్రమాదం. బోరు నీరు స్వీట్ కోసం వాడే కెమికల్స్ వల్ల ఎముకల్లో పటుత్వం దెబ్బతింటుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి. ప్లాస్టిక్ క్యాన్లు, డ్రమ్ములు, ప్యాకెట్లలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన నీటిని తాగొద్దు. ప్లాంట్ల వద్ద పరిశుభ్రత వాతావరణం, అన్ని అనుమతులతోనే వాటర్ ప్లాంట్లను నిర్వహించాలి. లేకపోతే భవిష్యత్‌లో ప్లాంట్ల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు. ఎలాంటి మినరల్స్ లేని లేని నీటిని తాగితే కీళ్ల నొప్పులు, థైరాయిడ్ ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉంది.