S Jaishankar : యూరప్ అందించే ఆయుధాలతో ఇండియాపై దాడులు జరుగుతున్నాయని, కానీ, యూరప్‌పై దాడులకు ఇండియా ఆయుధాలు అందించడం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయడాన్ని వెస్టర్న్ కంట్రీస్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇండియా తరఫున జైశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరుగుతున్న కుల్టారంటా టాక్స్ కార్యక్రమంలో జైశంకర్ శుక్రవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు, యూరప్ దేశాల అభ్యంతరంపై మాట్లాడారు. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యా నుంచి ఇండియా చమురు ఎలా కొంటుందని యూరప్ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై జైశంకర్ ఘాటుగా స్పందించారు. యూరప్ దేశాల నైతికతపై ప్రశ్నించారు. యూరప్ దేశాలు ఆయుధాలు అందిస్తుంటే, ఇండియాపై దాడులు జరుగుతున్నాయన్నారు. అలాంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును ప్రశ్నించే అర్హత లేదన్నారు. అందుబాటు ధరలు, లభ్యతను బట్టి ఇండియా తన అవసరాలకు అనుగుణంగా చమురు కొనుగోలు చేస్తుందని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనే యూరప్ దేశాలు మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ కొనడం వల్ల రష్యా చమురు భారీగా మిగులుతోందని, దీంతో తాము ఆ దేశం నుంచి ఆయిల్ కొంటున్నామని వివరించారు.
గతంలో రష్యా నుంచి చమురు ఇండియా చమురు కొనుగోలును అమెరికా కూడా ప్రోత్సహించిందన్నారు. రష్యాకు ఇండియా అనుకూలంగా వ్యవహరిస్తోందని అక్కడి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఉందన్నారు. ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు యూరప్ దశాబ్దాలుగా ఆయుధాలు సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. యూరప్ చాలా ఏళ్లుగా అమ్ముతున్న ఆయుధాలతోనే ఇండియాపై దాడి జరుగుతోందని చెప్పారు. అయితే, యూరప్‌పై దాడులకు మాత్రం భారత్ ఎలాంటి ఆయుధాలు అందించడం లేదన్నారు. యూరప్ ఆయుధాలు కూడా ఇండియాపై దాడికి రాకూడదన్నారు. `