Uttam Kumar Reddy | నల్లగొండ ప్రతినిధి, నవంబర్8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డుమ్మా కొట్టారు. అప్పటివరకు సీఎంతోనే ఉన్న ఉత్తమ్ ఉన్నట్టుండి హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం తన పుట్టినరోజున రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. సీఎంతోపాటు మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్లో గుట్టకు చేరుకున్నారు. అంతకుముందు రాత్రే రోడ్డు మార్గాన మంత్రి కోమటిరెడ్డి యాదాద్రికి చేరుకున్నారు. సీఎంతోపాటు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకొని, అనంతరం నిర్వహించిన వైటీడీఏ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం, ఉత్తమ్ పాల్గొన్నారు. ఆ తర్వాత లంచ్ అక్కడే చేశారు. ఆ తర్వాత జరిగిన మూసీ యాత్రకు ఉత్తమ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ వెళ్లిన ఉత్తమ్
యాదగిరిగుట్ట నుంచి నేరుగా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వలిగొండ మండలం సంగెం గ్రామానికి బయలుదేరారు. ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉత్తమ్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం తన కాన్వాయ్‌లో మూసీ యాత్రకు రాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆది నుంచి మంత్రి ఉత్తమ్ మూసీ ప్రక్షాళనపై అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. చాలాసార్లు మౌనమే అయన సమాధానంగా వస్తున్నది. ఒకటీ రెండుసార్లు మాత్రమే ఈ విషయంపై స్పందించారు. కానీ మూసీ నదికి ఉత్తర సరిహద్దుగా ఆయన సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. మూసీ కాలుష్యం, దాని ప్రభావం ఇక్కడ కూడా ఉంటుం ది. మూసీ నది వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలిసేచోట కూడా హుజూర్‌గర్ నియోజకవర్గమే విస్తరించి ఉన్నది.
ఉత్తమ్ మౌనముద్ర
ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూలగొట్టడం, ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం, విపక్షాల విమర్శలు తదితర సమయాల్లోనూ మంత్రి ఉత్తమ్ మౌనమే వహించారు. హైడ్రా, మూసీ విషయంలో సీఎం ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్న ధోరణిని పలుమార్లు ఉత్తమ్ వ్యక్తపరిచినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
ముందస్తు సమాచారం లేదా?
వలిగొండ మండలంలో మూసీ సంకల్ప యాత్ర విషయమై ఉత్తమ్‌కు ముందస్తు సమాచారం లేనట్టు చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు కలిసి యాత్రకు తెరలేపి, మళ్లీ రేవంత్‌రెడ్డిని కలిసి జిల్లా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానించినట్టు డ్రామాను నడిపారని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ యాత్రకు ఉత్తమ్ దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌తోపాటు సీఎం యాత్రకు జిల్లాకు చెందిన ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి కూడా డు మ్మా కొట్టడం చర్చనీయంశంగా మారింది.