హైదరాబాద్, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉలిక్కిపడ్డారు. హడావుడిగా ప్రెస్‌మీట్ ఏ ర్పాటుచేసి సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. పసలేని సమాధానాలతో, పొంతనలేని అం శాలతో, గతంలో లాగానే అవినీతి, అప్పులు అంటూ ఏకరువు పెట్టారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటిల్లుతున్న నష్టం, కాంగ్రెస్ సర్కారు అసమర్థతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ గర్జన తో కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్ హడలిపోయారు. సెక్రటేరియట్లో మంత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రం తిప్పి పంపిందని పచ్చి అబద్ధాలు వెల్లడించారు. తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి రాసిచ్చిందని అసత్యాలు వల్లెవేశారు. పాలమూరు-రంగారెడ్డికి మొత్తం 90 టీఎంసీలకు అనుమతులు కోరామంటూ కప్పిపుచ్చుకునేందుకు యత్నించారు. గత ప్రభు త్వం చేసిన అప్పుల వల్లే ప్రాజెక్టులు కట్టలేకపోతున్నామంటూ ఎదురుదాడికి దిగారు. మరోసారి పూర్తిస్తాయి సమావేశం ఏర్పాటు చేస్తానంటూ సమావేశాన్ని ముగించారు.
కేసీఆర్ సమావేశం ముందు రోజు నుంచే ఉత్తమ్ హడలెత్తిపోయారు. సాగునీటిశాఖ ఉన్నతాధికారులతో శనివారమే ప్రత్యేకంగా చర్చించారు. అందరూ అందుబాటులో ఉం డాలంటూ హుకుం జారీ చేశారు. ఆదివారం రోజున కేసీఆర్ సమావేశాన్ని అణువణువు ఫాలో అయ్యారు. రాత్రి 8 గంటలకు సెక్రటేరియట్లో మంత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కేసీఆర్ ప్రస్తావించిన అంశాలకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. తుదకు కేసీఆర్ సమావేశానికే ప్రాధాన్యం ఇవ్వకుండా.. తన సమావేశాన్ని బాగా కవర్ చేయాలంటూ మీడియా ప్రతినిధులకు మంత్రి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ సమావేశంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు అంటే ప్రభుత్వం ఎంతగా హడలిపోయిందో ఆయా అంశాలను బట్టి తెలిసిపోతున్నది.