కోదాడ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యసామాన్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, దేశ ప్రజల లక్ష్యసాధన కోసం త్రివిధ దళాలు పాకిస్థాన్‌లో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో శత్రుసేనలకు చెందిన తొమ్మిది స్థావరాలపై చేసిన దాడులు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోదాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేరేపిత తీవ్రవాదాన్ని తుదముట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపిన డైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తున్నదని కొనియాడారు.
భారత వైమానికదళంలో పనిచేసిన అనుభవం తనకుందని, అందులో యుద్ధ విమానాల పైలట్‌గా యుద్ధ సమయంలో పనిచేసిన అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవంతో చెబుతున్నా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకుగాను త్రివిధ దళాలు సమర్ధవంతంగా, ఎంతో చాక చక్యంగా శత్రు శిబిరాలపై దాడులు జరిపి దాయాది దేశానికి సరైన గుణపాఠం నేర్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.