వరంగల్, మే 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని అన్ని దశల్లో పనులను రెండేండ్లలో పూర్తి చేస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులోని పంపు హౌస్ స్టేషన్‌ను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. పంపు హౌస్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, రాజేందర్‌రెడ్డి, యశస్వినీరెడ్డి, వరంగల్ మేయర్ సుధారాణి, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్, ఈఎన్సీ అనిల్ కుమార్, సీఈ అశోక్ కుమార్ పాల్గొన్నారు. జనగామ నియోజకవర్గంలో ఆగిపోయిన దేవాదుల పనులను వెంట నే పూర్తి చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. జనగామ నియోజకవర్గానికి ధర్మసాగర్ నుంచి గండిరామారం వరకు నీరు తరలించే 4 మోటర్లు గురించి వివరించారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి వద్ద ఆగిపోయిన కాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరా రు. గత ప్రభుత్వం మూడు లిఫ్ట్‌లకు సంబంధించి రూ.104 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఒక లిఫ్ట్ ద్వారా తరిగొప్పుల మండలంలోని 15 గ్రామాలకు నీరు అందించే పనులను పరిశీలించాలని సూచించారు.