Krishna Water | హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ) : ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలోనే వినియోగించుకోవాలని, ఆ మేరకు ట్రిబ్యునల్ ఎదుట పునఃసమీక్ష పెట్టి అనుమతుల కోసం కృషి చేయాలని అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులను ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అంతరాష్ట్ర జలవివాదాలు, వాటి పురోగతి తదితర అంశాలపై జలసౌధలో ఆదివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. తెలంగాణకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ అంతర్రాష్ట్ర జల వివాదాల స్థితిగతులను, కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ 2) పురోగతిని మంత్రికి సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వివరించారు. కృష్ణాజలాల వినియోగానికి సంబంధించి 2015లో తెలంగాణ, ఏపీ మధ్య జరిగిన ఒప్పందం తాత్కాలికమేనని, అదీ ఆ ఏడాది కాలానికి మాత్రమేనని వెల్లడించారు. ఆ ఒప్పందాన్ని ట్రిబ్యునల్ ఎదుట పునఃసమీక్ష పెట్టి అవార్డు వచ్చేదాకా కృష్ణా జలాలను చెరిసగం వినియోగించుకునేలా సవరించాలని కోరే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించే అంశాన్ని వైద్యనాథన్ ప్రస్తావించగా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోయేది లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టంచేశారు. ఆ మేరకు అసెంబ్లీలోనే తీర్మానం చేశామని గుర్తుచేశారు. కృష్ణాబేసిన్‌లో తెలంగాణ నీటి హక్కులు, ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న కేడబ్ల్యూడీటీ 2 అవార్డు గురించి కర్నాటక, మహారాష్ట్రతో చర్చించి సామరస్యంగా పరిషరించుకోవాలని సీనియర్ న్యాయవాదులు సూచించగా, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బేసిన్ పరిమితుల ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధత కల్పించాలని, అందుకోసం ఎక్కడా రాజీపడకుండా ముందుకుసాగాలని సూచించారు. ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో కృష్ణాజల వివాదాలను వాదిస్తున్న ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాథన్, రవీందర్రావు, ఈఎన్సీ నాగేందర్రావు, అంతర్రాష్ట్ర జలవిభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ సల్లా విజయ్‌కుమార్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.