అబద్ధాలు ఆవిరయ్యాయి. కుట్రలు కొట్టుకుపోయాయి. కుర్చీ ఎక్కింది మొదలు కాళేశ్వరాన్ని టార్గెట్ చేసి, దానిని ఎందుకూ పనికిరానిదిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్.అయితేనేం, లక్షల క్యూసెక్కుల వరదను తట్టు కుని గంభీరంగా నిలిచిన తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం నీళ్లు ఇప్పుడు కట్టలు తెంచుకుని వెల్లువై కాల్వల్లో ప్రవహిస్తున్నాయి.కాళేశ్వరంతో లక్ష కోట్లు వృథా అయ్యాయంటూ ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన ప్రభుత్వానికి చివరికి అదే దిక్కైంది. కాళేశ్వరం సిస్టంను వాడుకుంటామని స్వయంగా సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండోసారి ప్రకటించడం ప్రాజెక్టు సాధించిన మరో విజయం.
Uttam Kumar Reddy | హైదరాబాద్, జూలై28 (నమస్తే తెలంగాణ): అన్ని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బరాజ్‌లు మినహా ఎల్లంపల్లి నుంచి ఉన్న మిగతా వ్యవస్థనంతటినీ వాడుకుంటామని పునరుద్ఘాటించారు. జలసౌధ వేదికగా రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఇరిగేషన్‌శాఖ అధికారులతో ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులవారీగా పనుల పురోగతిని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ.. రాబోయే ఏడాదిలో 6.50 లక్షల ఎకరాల, ఆయకట్టుకు, రానున్న ఐదేండ్లలో 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనేది లక్ష్యమని చెప్పారు. నీటి పారుదలశాఖకు నిధుల కేటాయింపులు బాగున్నాయని, లక్ష్యాలకు అనుగుణంగా పనులు వేగవంతం చేసే బాధ్యత అధికారులదేనని స్పష్టంచేశారు. పనులు సకాలంలో పూర్తి చేస్తే గుర్తిస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటవెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులపై నిందారోపణలు చేయడం సహేతుకం కాదని, ఏమైనా ఆధారాలు ఉంటే విచారణ కమిషన్‌ను కలిసి సమాచారం ఇవ్వాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రశాంత్‌పాటిల్, ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేందర్రావు, హరిరాం, చీఫ్ ఇంజినీర్లు, పలువురు ఎస్ఈలు పాల్గొన్నారు.
ఉత్తమ్ సాక్షిగా విద్యుత్తు అంతరాయం వెంటనే పునరుద్ధరించాం: అధికారులు
రాష్ట్రంలో నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్భాటంగా ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ జలసౌధలో ఆదివారం సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా అవాకయ్యారు. ఖైరతాబాద్ జలసౌధలో కరెంటు సరఫరా నిలిచిపోయిన ఘటనపై హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ అధికారులు స్పందించారు. విద్యుత్తు లైన్లో సాంకేతిక సమస్యలతో సుమారు రెండు నిమిషాలపాటు ట్రిప్ అయిందని, దాన్ని సరిచేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని వివరణ ఇచ్చారు.