హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఎఫ్‌సీఐకి బియ్యం (సీఎమ్మార్) ఇచ్చేందుకు ధాన్యం మిల్లింగ్‌ను వేగవంతం చేయాలని, గడువులోపు లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సీఎమ్మాఆర్పై సోమవారం సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి మంత్రి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 31లోగా సుమారు 43 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అందించాల్సి ఉంటుందని చెప్పారు.
గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయని పక్షంలో సదరు అధికారులపై, మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లర్లు, అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే పౌరసరఫరాల సంస్థకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బియ్యం కావాలని అడుగుతున్నప్పటికీ వాటిని సమకూర్చడంలో రాష్ట్రంలో సరిగ్గా పని చేయడం లేదని చెప్పారు. ఈ నిర్లక్ష్యం వల్లే సంస్థ రూ. 56 వేల కోట్ల అప్పుల్లో, రూ.11 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సీఎమ్మార్ కింద ఇస్తున్నారనే ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రేషన్ షాపులకు ఇచ్చే బియ్యంలో బస్తాకు 4-5 కేజీలు తక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు.