Minister Uttam Kumar Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ నిబద్ధత ఇదే నిదర్శనమన్నారు. ప్రజలతో బలమైన అనుబంధాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉన్నారన్నారు. ప్రజా పాలన ఎలా ఉండాలో ఒక నెలలోనే తాము ప్రదర్శించామన్నారు. తెలంగాణ ప్రజలు కొత్త స్వాతంత్య్ర భావాన్ని గ్రహిస్తున్నారన్నారు. గత నెల రోజులుగా నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల పనితీరును అంచనా వేసేందుకు పలు సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ నష్టం తదితర అంశాలపై సమీక్షించామని, కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు విషయాన్ని ప్రజలకు, మీడియాకు వివరించామన్నారు. ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామన్నారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జలవనరుల మంత్రిని సీఎంతో కలిసి ఢిల్లీలో కలిశామన్నారు. రాష్ట్రంలోని రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని వివరించారు.