Congress | హైదరాబాద్, నవంబర్21(నమస్తే తెలంగాణ): ప్రజాపాలన విజయోత్సవ సభలు అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీ స్థానిక నాయకత్వం, కార్యకర్తలు విముఖత చూపుతున్న నేపథ్యంలో వారిలో ఉత్సాహం నింపేందుకు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలను సోషల్ మీడియా లీకుల ద్వారా ప్రచారంలోకి తీసుకుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వరంగల్ విజయోత్సవ సభకు ఆశించిన మేరకు మహిళలు రాలేదని, ప్రభుత్వ కార్యక్రమం పూర్తిగా అధికారుల మీదనే వదిలేశారని రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 10.5 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలు ఉండగా వరంగల్ సభకు లక్ష మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. గ్రామాలకు 900 బస్సులు, ప్రతి బస్సుకు మహిళా కానిస్టేబుల్‌ను పెట్టినప్పటికి 40 వేలకు మించి హాజరు కాలేదని చర్చకు వచ్చినట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో విజయోత్సవ పాలన వాతావరణమే కనిపించడంలేదని, జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 హామీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్యేలకు నిధులు లేకపోవడం, నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడం, పీసీసీ కార్యవర్గ కూర్పు లేకపోవడంతో క్యాడర్లో నిర్లిప్తత నెలకొందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిసింది. రుణమాఫీ చేశామని చెప్పుకోవడంలో విఫలమయ్యామని భట్టి అన్నట్టు తెలిసింది. కార్యకర్తల్లో ఉత్సాహం లేకపోతే నవ్వినోని ముందు జారిపడ్డట్టు అవుతుందని అనుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వానికి అనుసంధానంగా పార్టీని నడపడంలో పీసీసీ విఫలం అవుతున్నట్టు చర్చకు వచ్చినట్టు సమాచారం. పార్టీ నాయకత్వం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు వెంటనే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడికి సూచించినట్టు తెలిసింది. మార్కెట్ కమిటీ చైర్మన్లు, పాలకమండలి సభ్యులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం కొలిక్కి రాబోతున్నదని, మిగతా నామినేటెడ్ పదవులను త్వరితగతిన భర్తీ చేయడానికి కసరత్తు జరుగుతున్నదని, ముఖ్యనేతలు ఈ నెల చివర ఢిల్లీ వెళ్లి అధినాయకత్వాన్ని కలవాలని నిర్ణయించినట్టు సోషల్ మీడియాలో లీకులు వదలాలని, ప్రధాన మీడియాకు ఇదే సమాచారం లీకులుగా పంపాలని సూచించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే వేగంగా జరుగుతున్నదని, ఈ సమాచారాన్ని క్రోడీకరించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుబోతున్నామనే విషయం క్యాడర్‌కు చెప్పాలని సూచించినట్టు తెలిసింది. వారికి ఆశ చూపిస్తేనే ఉత్సాహంగా పనిచేస్తారననుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకించినట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద ఇప్పటి వరకు జాతీయ నాయకులు రాహుల్, ప్రియాంకాగాంధీ నుంచి ఆదేశాలు లేవని, వారి దృష్టిలోలేని అంశాలను కార్యకర్తలకు ఎలా చెప్పగలమని వాదించినట్టు సమాచారం. జెండాలు మోసిన కార్యకర్తలకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిని మోసం చేయడం మంచిదికాదని, క్యాడర్‌తో ఆటలు వద్దని సీరియస్‌గానే చెప్పినట్టు తెలిసింది.