సూర్యాపేట, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున ప్రతినెలా సన్న బియ్యం అందించి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పేదోళ్లకు కడుపునిండా తిండి పెట్టేందుకే తమ ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారుల కోసం సన్నబియ్యం పథకాన్ని ఈ ఉగాది పర్వదినాన ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో సన్నబియ్యం పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.
తొలుత సీఎం, మంత్రి ఉత్తమ్‌తోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వం 3 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం రూ.10కి మిల్లర్లు కొని మళ్లీ ప్రభుత్వానికి రూ.30కి అమ్ముతున్నారని విమర్శించారు. ఇదంతా గమనించి పేదోళ్లు కూడా తినేలా సన్నబియ్యం ఇవ్వడంతో మిల్లర్ల అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని చెప్పారు. ఇది ఆషామాషీ పథకం కాదని, చరిత్రలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు సీఎం అయినా ఈ సన్నబియ్యం పథకాన్ని రద్దు చేయలేరని తేల్చిచెప్పారు. ఆ చరిత్రకు హుజూర్నగర్ వేదిక కావడం, ఈ చైతన్యానికి మీరంతా ప్రతీకలే అని పేర్కొన్నారు.
రామగిరి, మార్చి 30: హుజూర్నగర్ నియోజవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు, మాజీ సర్పంచులపై ప్రభుత్వం నిర్బంధకాండ విధించింది. బీఆర్ఎస్ నాయకులతోపాటు సీపీఎం, ఎమ్మార్పీఎస్ తదితర ప్రజాసంఘాలపై కక్షపూరితంగా వ్యవహరించింది. ఆదివారం ఉదయం నుంచే నేతల ఇండ్ల వద్దకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్స్టేసన్లకు తరలించారు.
కొండమల్లేపల్లి, గుర్రంపోడులో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హాలియా, చిట్యాల, దామరచర్లలో బీఆర్ఎస్, సీపీఎం నాయకులను, త్రిపురారంలో మాజీ సర్పంచులను, తిరుమలగిరి సాగర్‌లో బీఆర్ఎస్వీ, దళిత సంఘాల నాయకులను, కట్టంగూర్‌లో సీపీఎం, ఎమ్మార్పీఎస్ నాయకులను, హుజూర్నగర్, మఠంపల్లి, పాలకవీడు, గరిడేపల్లి, అనంతగిరి, మద్దిరాల, అర్వపల్లిలో బీఆర్ఎస్, సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నదని నిర్బంధంలో ఉన్న నేతలు మాట్లాడుతూ మండిపడ్డారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించడంపై పలువురు నేతలు మండిపడ్డారు. నిర్బంధాలు, అరెస్టులతో ప్రభుత్వం పాలన సాగించలేదని, హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి సారించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివానం జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలంలో రాములవారి కల్యాణానికి రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ అర్చకులు కల్యాణ పత్రికను అందజేశారు. అనంతరం పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.
తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని చెప్పారు. తెలంగాణలో వర్షాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, పంటలు అద్భుతంగా పండుతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి బుద్ధి కుశలతకు పదునుపెట్టి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు. ముఖ్యమంత్రికి నరఘోష తప్పదని, ఆయన చాలా కష్టపడి పనిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పంచాంగ శ్రవణం ముగిశాక ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయిక మాదిరి ఉందని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించారని కొనియాడారు. రాష్ర్టాభివృద్ధికి కోసం భట్టి, తాను జోడెడ్ల మాదిరిగా కృషి చేస్తామని చెప్పారు. రాష్ర్టానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, పేదలకు పంచాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని, అభివృద్ధి చేసే సమయమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సంస్థలు, పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.