హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం నుంచి కోటా మేరకు యూరియా రావడం లేదని, అందుకే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి 8.54 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 6.81 లక్షల టన్నులు మాత్రమే వచ్చినట్టు పేర్కొన్నారు. 1.73 లక్షల టన్నులు తక్కువగా వచ్చినట్టు వెల్లడించారు.
ఈ మేరకు ఆయన ఆదివారం యూరియా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి యూరియా రాకపోయినా ఆందోళన వద్దని, మార్క్ఫెడ్ వద్ద ఉన్న నిల్వలను జిల్లాలకు సరఫరా చేస్తున్నామని, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంతో పోల్చితే యూరియా వినియోగం కూడా పెరిగిందని స్పష్టం చేశారు.